వీడియో వైరల్ : విమానం రెక్కలపై డ్యాన్స్..

వీడియో వైరల్ : విమానం రెక్కలపై డ్యాన్స్..

సోషల్ మీడియా విపరీతంగా వాడటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ తమను తాము ఎలా ఫేమస్ చేసుకోవాలా అని చూస్తున్నారు. దాని కోసం వింత ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. అందులోనూ చిత్ర విచిత్రాలు చేసి ఫేమస్ అయిపోతున్నారు. కొందరు నిజంగా తమలోని టాలెంట్ చూపిస్తుంటే, కొందరు విరక్తి పుట్టేలా చేసి అయినా సరే ఫేమస్ అవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు  తాజాగా విమాన సిబ్బంది ఏకంగా విమానం రెక్కలపై నిల్చొని డ్యాన్సులు వేశారు.

ప్ర యాణికులే కాదు.. విమాన సిబ్బంది కూడా తమ చేష్టలతో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (Swiss International Air Lines )కు చెందిన సిబ్బంది కొందరు విమానం రెక్క (Plane Wing)పై ప్రమాదకరంగా డ్యాన్స్‌ చేస్తూ.. ఫొటోలు దిగి అధికారుల ఆగ్రహానికి గురయ్యారు.  దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముందుగా, వీడియోలో ఒక మహిళా ఫ్లైట్ అటెండెంట్ విమానం రెక్కపై నృత్యం చేస్తూ కనపడింది. తర్వాత ఒక మగ సహోద్యోగి కూడా చేరాడు. సీనియర్ క్యాబిన్ చీఫ్‌గా భావించే రెండో వ్యక్తి కూడా వీడియోలో వివిధ భంగిమల్లో కనిపిస్తాడు. ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది కూడా విమానం ఇంజిన్ ముందు ఫోటో తీయడం కనిపిస్తుంది.

అర్జెంటీనా (Argentina)లో స్విస్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777 విమానం సిబ్బంది కొందరు ప్రమాదకరంగా విమానం రెక్కపైకి వెళ్లి.. డ్యాన్స్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఎయిర్‌లైన్స్‌లోని ఓ ఎయిర్‌ హోస్టెస్‌, క్యాబిన్‌ చీఫ్‌లు విమానం రెక్కలపై నిల్చుని పలు రకాల ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో వేచి ఉన్న ఓ ప్రయాణికుడు తన కెమెరాలో బంధించడంతో...  అదికాస్తా  వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌లైన్స్‌ స్పందించింది.  సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. వీళ్ళు చేసిన పని విధ్వంసకరమైనది అని.. ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బోయింగ్ 777 విమానం రెక్కలు 16 .4 అడుగుల ఎత్తులో ఉంటాయని తెలిపారు.  అటువంటి ఎత్తు నుండి గట్టి ఉపరితలంపై పడటం వలన తీవ్రమైన గాయాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.సిబ్బంది విమానం రెక్కలపై నిల్చుని ఫొటోలు దిగిన సమయంలో లోపల ప్రయాణికులు ఎవరూ లేరని చెప్పారు. అయినా సిబ్బంది భద్రతా నిబంధనలు ఉల్లఘించారని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.