తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్. బుధవారం ( జూన్ 3 ) జరిగిన సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర క్యాబినెట్. NH-63లో ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల మార్గాన్ని 4 లేన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. దీంతో పాటు NH-563లో జగిత్యాల–కరీంనగర్ రహదారిని కూడా 4 లేన్లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర క్యాబినెట్.
రూ.7 వేల 597 కోట్లతో 190 కిలోమీటర్ల ప్రాజెక్ట్:
ఈ క్రమంలో తెలంగాణలో మొత్తం 190.76 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.7 వేల 597 కోట్లు. ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల సెక్షన్‌ను హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (HAM) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. జగిత్యాల – కరీంనగర్ సెక్షన్ బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (BOT-Toll) విధానంలో నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమిచ్చి ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడనుంది.
కేంద్ర క్యాబినెట్ ఇతర కీలక నిర్ణయాలు:
- విమాన ఇంధనం (ATF) ధరలను స్థిరీకరించేందుకు రూ. పది వేల కోట్ల ATF ధర స్థిరీకరణ నిధికి ఆమోదం.
- ఢిల్లీలో పాత ట్రక్కులు, బస్సులను దశలవారీగా తొలగించేందుకు రూ.5 వేల 41 కోట్లకు ఆమోదం.
- రామేశ్వరం–కోణార్క్–పరదీప్ తీర రహదారి ప్రాజెక్టు కోసం రూ.8 వేల 301 కోట్లు మంజూరు.
- బీహార్‌లోని NH-31, NH-231లపై ఖగారియా–పూర్నియా మార్గాన్ని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు రూ.3 వేల 936 కోట్లకు ఆమోదం.
- మధ్యప్రదేశ్‌లో NH-347B రహదారి అప్‌గ్రేడేషన్‌కు రూ.4 వేల 415 కోట్లకు ఆమోదం.
