బుగ్గవాగు ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్

బుగ్గవాగు ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్
  •  సీఎం రేవంత్, మంత్రి మండలికి మంత్రి తుమ్మల కృతజ్ఞతలు

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో సాగునీటి రంగానికి బలాన్నిచ్చే బుగ్గవాగు ఎడమ వరద కాలువ పనులను సంబంధించి సవరించిన అంచనాలకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రిమండలికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలుతో కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో వ్యవసాయ రంగానికి కొత్త దశ రానున్నది. బుగ్గవాగు ఆనకట్ట నుంచి ఎడమ వరద కాలువ, బ్రాంచ్ కాలువలు, అనుబంధ సివిల్ పనుల కోసం మొత్తం రూ.88.42 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతిని క్యాబినెట్ మంజూరు చేసింది. ప్రారంభ అంచనా రూ.39.21 కోట్లుగా ఉండగా, సాంకేతిక మార్పులు, ఆధునీకరణ కారణంగా వ్యయం పెరిగింది.

తాజా అంచనాల ప్రకారం కాల్వ పనులకు రూ.53.29 కోట్లు, పన్నులు రూ.21.23 కోట్లు, భూసేకరణకు రూ.10.71 కోట్లు, ఇతర వ్యయాలకు రూ.3.19 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు అమలుతో కామేపల్లి, రఘునాథపాలెం మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 31 చెరువులను నీటితో నింపే అవకాశం ఉంటుంది. దాదాపు 2,866 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుండటంతో, రైతులకు సాగునీటి భరోసా కలుగుతుంది. గతంలో భూసేకరణ సమస్యలు, రైతుల అభ్యంతరాల కారణంగా ఈ పనులు నిలిచిపోగా,  మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో ప్రాజెక్టు రూపకల్పనలో కీలక మార్పులు చేశారు.