భూముల అమ్మకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

భూముల అమ్మకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
  • హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వేలం 
  • నాలుగు నెలల్లో నాలుగు విడతల్లో విక్రయం
  • రూ.13,500 కోట్లు వస్తయని అంచనా
  • పథకాలకు పైసల్లేక సర్కార్ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: మరిన్ని భూములు అమ్మేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దాదాపు 500 ఎకరాలను విక్రయించాలని టార్గెట్ పెట్టుకుంది. వీటితో కనీసం రూ.13,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే పెద్ద ఎత్తున అప్పులు చేసింది. వాటి కిస్తీలు, మిత్తీలు, ఉద్యోగులకు జీతాలు, పథకాల అమలుకు వస్తున్న ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఇక ఇప్పుడు కొత్త పింఛన్ల కోసం ఏటా అదనంగా రూ.3,240 కోట్లు కావాలి. ఈ నెలలో రైతు బీమాకు రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. కల్యాణ లక్ష్మీ, దళిత బంధు, రైతు బంధు, ఇతర పథకాల అమలుకు రూ.వేల కోట్లు కావాలి. వీటికి తోడు ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంట్లకు రూ.వేల కోట్ల నిధులు అవసరం ఉంది. పైగా ఇప్పటికే రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ క్రమంలో కేబినెట్ మీటింగ్ లో నిధుల సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. మళ్లీ అప్పులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో భూములు అమ్మాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. 

రంగారెడ్డిలోనే 280 ఎకరాలు... 

రాష్ట్ర సర్కార్ ఇప్పటికే రాజీవ్ స్వగృహ, ఇతర భూముల అమ్మకం ప్రారంభించింది. అయితే జిల్లాల్లోని భూములు అమ్మితే తక్కువ ఆదాయం వస్తుండడంతో.. ఈసారి ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో భూములను అమ్మాలని ప్లాన్ చేసింది. అధికారులు ఒక్క రంగారెడ్డి పరిధిలోనే 280 ఎకరాలు గుర్తించారు. ఇందులో బుద్వేల్, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఎక్కువ భూములు ఉన్నాయి. ఇక సంగారెడ్డి పరిధిలో 185 ఎకరాలు, హైదరాబాద్ పరిధిలో 35 ఎకరాలు వేలం వేయనున్నారు. ఈ భూములన్నీ ఎలాంటి లిటిగేషన్ లేకుండా ఉన్నాయి. వీటిని ఒకేసారి కాకుండా 4 నెలల్లో 4 విడతల్లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో విడతలో 120 ఎకరాల నుంచి 150 ఎకరాలు అమ్మాలని నిర్ణయించినట్లు సెక్రటేరియట్ లోని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.   

లోటు పూడ్చుకోవాలని... 

బడ్జెట్ అంచనాలు మించిపోవడం, ఇష్టారీతిన అప్పులు చేయడంతో రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ నుంచి మొత్తం రూ.54 వేల కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్ అనుకుంది. కానీ ఇప్పటికే అప్పులు ఎక్కువ ఉండడంతో, దాన్ని రూ.39 వేల కోట్లకే కేంద్రం పరిమితం చేసింది. గ్యారంటీ అప్పులు రూ.20 వేల కోట్ల దాకా ఆగిపోయాయి. దీంతో మొత్తం రూ.35 వేల కోట్లు ప్రభుత్వానికి తగ్గిపోతున్నాయి. ఈ మొత్తం లోటును భూములు అమ్మడం ద్వారానే సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పన్నులు, చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం.. ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నరే ఉండడంతో భూముల అమ్మకమే కరెక్టు అని ఆలోచిస్తోంది. 

ఆ 2 స్కీమ్​లకే 25 వేల కోట్లు అవసరం.. 

సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు, దళిత బంధు పథకాలకే రూ.25 వేల కోట్లు అవసరం కానున్నాయి. దళిత బంధుకు ఈ ఏడాది రూ.17,700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. దీనికి బీఆర్వో ఇచ్చినప్పటికీ, ఒక్క పైసా విడుదల చేయలేదు. వచ్చే యాసంగి రైతు బంధుకు రూ.7,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు కల్యాణ లక్ష్మీ, స్కాలర్ షిప్ పాత బకాయిలు కలిపితే దాదాపు రూ.5,300 కోట్లు అవుతాయి. ఇక ఇరిగేషన్ , ఆర్ అండ్ బీ ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు సమకూర్చాల్సి ఉంది. 

ఇప్పటికే 6 వేల కోట్ల భూముల అమ్మకం..  

రాజీవ్ స్వగృహ, ఇతర భూముల అమ్మకంతో సర్కార్ కు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లపైనే ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 500 ఎకరాల అమ్మకంతో రూ.13,500 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఎకరాకు కనీసం రూ.15 కోట్లు, గరిష్టంగా రూ.30 కోట్లు రావొచ్చని భావిస్తోంది. వాస్తవానికి భూముల అమ్మకంతో రూ .15,500 కోట్లు వస్తాయని ఈసారి బడ్జెట్ లో సర్కార్ అంచనా వేసింది. ఇప్పుడది రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. కోకాపేట, ఖానామెట్ భూములకు ఎకరాకు రూ.30 కోట్లు అంచనా వేస్తే, గరిష్టంగా రూ.60.2 కోట్లు పలికింది. ఇప్పుడు రియల్ బూమ్ మరింత పెరగడంతో అంచనా కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది.