స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్: డిసెంబర్ 11 లోపు లోకల్ నోటిఫికేషన్..!

స్థానిక ఎన్నికలపై బిగ్ అప్డేట్: డిసెంబర్ 11 లోపు లోకల్ నోటిఫికేషన్..!

హైదరాబాద్: వచ్చే నెల (డిసెంబర్) 11వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. గురువారం (నవంబర్ 20) కామారెడ్డి జిల్లా భిక్కనూరులో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. అనంతరం మండలంలోని బస్వాపూర్‎లో మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా గ్రామ పంచాయతీలకు, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అన్నారు. 

పంచాయతీ ఎన్నికలకు ముందుగా నిర్వహించకపోతే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ల్యాప్స్ అవుతాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న రిజర్వేషన్ల ప్రకారమే 27% బీసీ రిజర్వేషన్లతో ముందుకు పోతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ

భిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో రూ.92.80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క భూమిపూజ చేశారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి రుణాలు మంజూరు చేస్తుందన్నారు. స్వయం ఉపాధితోపాటు వ్యాపార రంగంలో మహిళలు రాణించాలని.. ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందన్నారు.