
- ఇతర అంశాలపై మంత్రులతో చర్చించనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డులు, అథ్లెట్లు నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగాలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
అలాగే జీహెచ్ఎంసీలో విలీనం కానున్న ఔటర్ రింగ్ రోడ్ లోపలి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల అంశంకు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సమావేశం తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టనున్నట్లు తెలిసింది.
మరోవైపు హైదరాబాద్ అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళన, మౌలిక సౌకర్యాల కల్పన, రీజినల్ రింగు రోడ్డు నిర్మాణం, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ తదితర అంశాలకు సంబంధించి కూడా సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో కొన్ని పనులకు ప్రపంచబ్యాంకు నుంచి ఆర్థిక సాయం పొందాలని ప్రభుత్వం భావిస్తున్నందున కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.