నెలాఖరుకల్లా... వ్యాక్సినేషన్ అయిపోవాలె

నెలాఖరుకల్లా... వ్యాక్సినేషన్ అయిపోవాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌‌పై పూర్తిగా ఫోకస్ చేయాలని సూచించింది. మంత్రి హరీశ్‌‌ నేతృత్వంలోని కమిటీ వ్యాక్సినేషన్‌‌పై సెక్రటేరియట్‌‌లో బుధవారం సమావేశమైంది. మంత్రులు కేటీఆర్‌‌‌‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, పెద్దాఫీసర్లు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలవారీగా వ్యాక్సినేషన్ వివరాలను మంత్రులకు ఆఫీసర్లు వివరించారు. ‘‘45 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. 45 శాతం మంది సింగిల్ డోసు తీసుకున్నారు. మిగతా 10 శాతం ఒక్క డోసు కూడా తీసుకోలేదు. అసిఫాబాద్, వికారాబాద్, గద్వాల్, నారాయణపేట్, ఆదిలాబాద్, వనపర్తి, నాగర్‌‌‌‌కర్నూల్, మహబూబ్‌‌నగర్‌‌‌‌, వరంగల్ జిల్లాల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా జరిగింది” అని చెప్పారు. దాంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో మంత్రులు మాట్లాడారు. ‘‘మండలాలు, నియోజకవర్గాలవారీగా ప్లాన్ చేసుకొని నెలాఖరుకల్లా వంద శాతం చేయించండి. ఈ నెలంతా వ్యాక్సినేషన్ సెంటర్లను విజిట్ చేయండి. ఎడ్యుకేషన్‌‌, మున్సిపల్, పంచాయతీరాజ్‌‌ సిబ్బందిని కూడా వాడుకోండి. వంద శాతం వ్యాక్సినేషన్ జరిగిన గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలను ప్రకటించండి” అని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌‌పై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో పబ్లిక్‌‌ ప్లేసుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని హరీశ్‌‌ సూచించారు. ఒమిక్రాన్ పై ఆందోళన అక్కర్లేదని, జాగ్రత్తగా ఉంటే చాలని కేటీఆర్ అన్నారు. కరోనాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆఫీసర్లకు సూచించారు. విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు పెట్టాలని సబిత సూచించారు.

కరోనా కేసులు కొద్దిగ పెరిగినయ్
రాష్ట్రంలో కరోనా కేసుల స్వల్పంగా పెరిగాయి. గడిచిన వారంలో రోజుకు సగటున 150 కేసులు దాటలేదు. బుధవారం మాత్రం 193 కేసులు ఫైల్ అయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో రెండ్రోజుల నుంచి టెస్టుల సంఖ్య పెంచడంతో కేసుల సంఖ్యా పెరిగింది. మంగళవారం కూడా 196 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. బుధవారం 40,018 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్ హైదరాబాద్‌‌లో 73 మందికి, జిల్లాల్లో 120 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,76,187కి చేరగా, ఇందులో 6,68,564 మంది కోలుకున్నట్టుగా చూపించారు. ఇంకో 3,630 యాక్టివ్‌‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనాతో బుధవారం మరొకరు చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 3,993కి పెరిగిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు.