కాగ్​ లెక్కల ప్రకారం కాళేశ్వరంతో 40 వేల ఎకరాలే సాగులోకి..

కాగ్​ లెక్కల ప్రకారం కాళేశ్వరంతో 40 వేల ఎకరాలే సాగులోకి..

ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు పెడితే కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం లక్ష ఎకరాలేనని,  కాగ్ రిపోర్ట్‌‌ ప్రకారం అయితే 40 వేల ఎకరాలేనని మంత్రు ఉత్తమ్​ గుర్తు చేశారు. ‘‘క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండీచర్‌‌ అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్న గత సర్కారు అప్పుల పరిస్థితి ఇదీ. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే సాగులోకి వచ్చిన కొత్త ఆయకట్టు సున్నా.  సీతారామ ప్రాజెక్ట్‌‌ కు రూ.7500 కోట్లు ఖర్చు చేస్తే కొత్త ఆయకట్టు సున్న. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి మీరు కొత్త ఆయకట్టు తీసుకురాక పోతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినవాళ్లు కాదా’’ అని ఉత్తమ్​ప్రశ్నించారు.

కేటీఆర్‌‌, హరీశ్​రావు చెప్పినవి అవాస్తవాలు

సివిల్ సప్లయ్స్‌‌ పై బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​రావులు ఆన్‌‌ రికార్డ్‌‌గా చెప్పిన విషయాలు అవాస్తవాలని మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ రూ.56 వేల కోట్ల అప్పు, రూ.11500 కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన తెలిపారు. గత పదేండ్లుగా రేషన్‌‌ బియ్యం సబ్సిడీ ఇవ్వనందుకు కార్పొరేషన్‌‌ అప్పులు 2014 నాటికి రూ.3361 కోట్లు ఉంటే, సబ్సిడీ ఇవ్వక రూ.56 వేల కోట్లకు పెరిగాయని చెప్పారు. గత ప్రభుత్వం నిర్వాకంతో ఏటా  కేవలం వడ్డీలకే రూ.3 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు. రూ.22 వేల కోట్ల విలువైన ధాన్యం రైస్‌‌ మిల్లర్ల వద్ద ఎలాంటి పూచీకత్తు లేకుండా ఉందని మంత్రి పేర్కొన్నారు.  సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నష్టాల్లో ఉన్నా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు వారి రాష్ట్రాల్లో అవసరాల కోసం స్టాక్‌‌ను నెలకు 2.50 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాలని కోరినా కేవలం పొలిటికల్‌‌ కారణాల వల్ల స్టాక్‌‌ ఉన్నా గత సర్కారు వారికి బియ్యం అమ్మలేదని మంత్రి ఉత్తమ్​ మండి పడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో డాక్యుమెంటేషన్‌‌ సరిగా చేయలేదని, కేంద్రం ఇవ్వాల్సిన వేల కోట్లు ఇంకా పెండింగ్‌‌లో ఉన్నాయని అన్నారు. గత సర్కారు సబ్సిడీ ఇవ్వలేదని, సెంట్రల్‌‌ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి తీసుకోలేదని తెలిపారు. అందుకే సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నదని వెల్లడించారు.