
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాకు భారీ తుఫానుతోపాటు వరద ముప్పు పొంచి ఉందని ఆ దేశ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. తుఫాను ముప్పును ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని.. వరదలు రాకముందే 2 వారాలకు సరిపడా సరుకులు తెచ్చుకోవాలని సూచించారు. అలాగే వరదలకు అడ్డుకట్ట వేయడానికి ఇసుక నింపిన సంచులను కూడా సిద్ధం చేసుకోవాలని ప్రజలను కోరారు. ప్రధానంగా కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో, ఉత్తర కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో బే వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించారు. 1.70 కోట్ల మందిపై వరదల ప్రభావం పడొచ్చని చెప్పారు.