కవలలే..కానీ, అన్న 2021లో.. చెల్లె 2022లో పుట్టిన్రు

కవలలే..కానీ, అన్న 2021లో.. చెల్లె 2022లో పుట్టిన్రు

కాలిఫోర్నియా: వాళ్లిద్దరూ కవలలు.. అమ్మ కడుపులో కలిసే పెరిగిన్రు, కానీ పుట్టిందేమో వేర్వేరు సంవత్సరాలలో! అన్నేమో 2021 లో పుడితే చెల్లి మాత్రం కేలండర్​ మారేదాకా ఆగి 2022లో పుట్టింది. కిందటేడాది డిసెంబర్​31 రాత్రి అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఫాతిమా మాడ్రిగల్​ అనే మహిళ ఈ పిల్లలకు జన్మనిచ్చింది. 
డిసెంబర్​ 31న రాత్రి కొత్త ఏడాదికి వెల్కమ్​  చెప్పేందుకు జనం ఎదురుచూస్తుంటే ఫాతిమా తన కవల పిల్లలకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తోంది. నట్విడాడ్ మెడికల్​ సెంటర్​లో ఆ రాత్రి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతోంది. రాత్రి 11:45 నిమిషాలకు ఫాతిమాకు కొడుకు పుట్టిండు. ఆ తర్వాత పదిహేను నిమిషాలకు.. అంటే సరిగ్గా 12 గంటలకు పాప పుట్టింది. బాబు పేరు అల్ఫ్రెడ్​అంటోనియో ట్రుజిల్లో, పాపకు అయిలిన్​ యోలండా ట్రుజిల్లో అని పేర్లు పెట్టారు. పిల్లలిద్దరికీ పదిహేను నిమిషాలు మాత్రమే తేడా.. కానీ ఆ పదిహేను నిమిషాల్లోనే ఓ రోజు మారింది. డిసెంబర్​ నెల చివరి రోజు కావడంతో ఏకంగా ఏడాదే మారిపోయింది. అన్నట్టు.. ఈ ఏడాదిలో కాలిఫోర్నియాలో పుట్టిన మొట్టమొదటి పాప అయిలిన్​ యోలండానేనని అధికారులు చెప్పారు. అమెరికాలో ఏటా లక్షా 20 వేల మంది కవలలు పుడుతుంటారని, కవలల్లో ఒకరు ఒకరోజు, ఇంకొకరు మరుసటి రోజు పుట్టడం చాలా అరుదని డాక్టర్లు చెప్పారు. ఇక ఇలా వేర్వేరు సంవత్సరాలలో పుట్టడం అత్యంత అరుదని, 20 లక్షల డెలివరీలలో ఒకటి మాత్రమే ఇలా జరుగుతుందని అన్నారు. 2019లో కూడా ఇలాంటి అరుదైన డెలివరీ ఒకటి ఇండియానాలో జరిగిందని.. ఆ ఏడాది డిసెంబర్​ 31 రాత్రి 11:37 నిమిషాలకు ఫస్ట్​ పాప పుట్టిన తర్వాత అర్ధరాత్రి దాటినంక.. 12:07 నిమిషాలకు రెండో పాప పుట్టిందని డాక్టర్లు తెలిపారు.