Operation Sindoor : కసబ్, హెడ్లీ ఉగ్ర శిక్షణ తీసుకున్న క్యాంప్స్ ఇవే.. మన దెబ్బతో నేల మట్టం

Operation Sindoor : కసబ్, హెడ్లీ ఉగ్ర శిక్షణ తీసుకున్న క్యాంప్స్ ఇవే.. మన దెబ్బతో నేల మట్టం

‘‘చెప్పులోన రాయి.. చెవిలోన జొరీగ..’’ అన్నట్లుగా ఎప్పుడూ కవ్విస్తూ సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్న పాకిస్తాన్ కు ఇండియా బుద్ధి చెప్పింది. ఒకవేళ ఇండియా తెగబడితే ఎలా ఉంటుందో ‘ఆపరేషన్ సిందూర్’ తో ట్రైలర్ చూపించింది. ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా ఏనుగుతో ఎలక కయ్యానికి దిగినట్లు ప్రవర్తించే పాక్ కు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే ఎలా ఉంటుందో రుచి చూపించింది. మంగళవారం (మే 6) రాత్రి పాకిస్తాన్ లోని కీలకమైన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ.

26/11 ముంబై ఉగ్రదాడికి పాల్పడిన అజ్మల్ కసబ్, సూత్రదారి డేవిడ్ హెడ్లీ తదితర కీలక ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన క్యాంపులను లేపేయడం ఆపరేషన్ సిందూర్ స్పెషల్. కేవలం 25 నిమిషాలలోనే పాక్ ఉగ్రమూకలకు కీలక స్థావరాలైన 9 క్యాంపులను ధ్వంసం చేసి ఇండియన్ ఆర్మీ పవరేంటో చూపించారు. అయితే కరుడుగట్టిన ఉగ్రవాదులను తయారు చేసిన అత్యంత కీలకమైన పీఓకే లో ఉన్న 5 క్యాంపులను, పాక్ లో ఉన్న మరో 4 క్యాంపులను ధ్వంసం చేయడం వెనుక ఇండియన్ ఆర్మీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ సందర్భంగా ఆ క్యాంపులు పాక్ ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషించే పాక్ కు ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసుకుందాం.

PoK లో ఉన్న టెర్రర్ క్యాంపులు:

1. షవాయ్ నల్లా క్యాంపు, ముజఫరాబాద్:

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)-ఇండియా బార్డర్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కర్ ట్రైనింగ్ సెంటర్ ఇది. 2024 అక్టోబర్ 20న జరిగిన సోన్ మార్గ్ అటాక్, అక్టోబర్ 24న జరిగిన గుల్ మార్గ్ అటాక్, ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి మొదలైన దాడులలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందినవారే.

2. సయిద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్:

జైషె-ఇమహమ్మద్ టెర్రర్ లాంచ ప్యాడ్ ఉన్నటువంటి క్యాంపు ఇది. బాంబులు వేయడం, యుద్ధ సామాగ్రిని అమర్చడం, అడవిలో క్లిష్టపరిస్థితుల్లో నివసించడం వంటి శిక్షణను ఈ క్యాంపు ఇస్తుంటుంది. 

3. గుల్మార్గ్ క్యాంపు, కోట్లి:

లైన్ ఆఫ్ కంట్రోల్ ((LoC) కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే లష్కర్ ట్రెర్రర్ గ్రూప్ కు సంబంధించిన బేస్ క్యాంప్ ఇది. ఈ క్యాంపు ఆధారంగా చేసుకుని జమ్మూ కశ్మీర్ లోని రజౌరీ, పూంచ్ జిల్లాలలో దాడులకు పాల్పడుతుంటారు ఉగ్రవాదులు. 2023 ఏప్రిల్ 20న, 2024 జూన్ 9న  పూంచ్ జిల్లాలో తీర్థయాత్రలకు వెళ్లిన టూరిస్టులపై ఈ క్యాంపు నుంచి వచ్చినవారే దాడులు జరిపారు. 024 జూన్ 9న బస్సుపై జరిపిన దాడిలో 9 మంది చనిపోయారు. 

4.బర్నాలా క్యాంపు, భింబార్:

లైన్ ఆఫ్ కంట్రోల్ ((LoC) కు 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయుధ శిక్షణ, IED శిక్షణ, అడవిలో ఉంటూ దాడి చేసే టెక్నిక్స్ లను నేర్పిస్తారు.


5. అబ్బాస్ క్యాంప్, కోట్లీ:

లైన్ ఆఫ్ కంట్రోల్ ((LoC) కు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్ననాటి నుంచి లష్కర్ ఫిదయీన్ ఫైటర్స్ ఇక్కడ శిక్షణ పొందుతారు. ఇక్కడ 15 మంది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చే కెపాసిటీ ఉంది. 


పాకిస్తాన్ లో ఉన్న టెర్రర్ క్యాంపులు:

ఇండియన్ ఆర్మీ పీఓకే లో ఉన్న క్యాంపులే కాకుండా పాకిస్తాన్ లో ఉన్న క్యాంపులను సైతం ధ్వంసం చేసింది. మీ దేశంలోకి వచ్చి మరీ వేటాడుతాం అన్నట్లుగా భారత్ పై తరచూ దాడులకు దిగుతున్న క్యాంపులను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసింది. అవి:

6. సర్జాల్ క్యాంపు, సియాల్ కోట్:

ఇంటర్నేషనల్ బార్డర్ కు 6 కి.మీ దూరంలో ఉంటుంది.  2025 మార్చిలో 5 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు ఇక్కడ శిక్షణ పొందిన టెర్రిరిస్టులు. 

7.మెహ్మూనా జోయా క్యాంపు, సియల్ కోట్:

హిజ్బుల్లా ముజాహిద్ధీన్ టెర్రిస్టులకు ఇది అతిపెద్ద క్యాంపు. ఇంటర్నేషనల్ బార్డర్ కు 12 కి.మీ దూరంలో ఉంటుంది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఇక్కడినుంచి టెర్రరిస్టులను జమ్మూ లోని కథువా ప్రాంతానికి పంపిస్తుంటారు. 2016లో జరిగిన పఠాన్ కోట్ దాడి వీళ్ల పనే. ఈ దాడిలో 8 మంది సైనికులు చనిపోయారు.

8. మర్కాజ్ తయీబా, మురిడ్కే:

లష్కర్ ఇ తాయిబా కు చెందిన కీలక క్యాంపు ఇది. ఇంటర్నేషనల్ బార్డర్ కు ఇది 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . 26/11 ముంబై దాడులలో పాల్గొన్న అజ్మల్ కసబ్, సూత్రదారి డేవిడ్ హెడ్లీ ఈ క్యాంపులోనే శిక్షణ పొందారు. 

9.  మర్కాజ్ సుభానల్లా, బహవల్పూర్:

జైషె ఇ మహ్మద్ సంస్థకు అతి పెద్ద, కీలకమైన స్థావరం ఇది. మౌలానా మసూద్ అజార్ దీనిని నడిపిస్తుంటాడు. ఇంటర్నేషనల్ బార్డర్ కు ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . జైషె ఉగ్రవాద సంస్థకు ఇది హెడ్ క్వార్టర్. టెర్రరిస్టులకు రిక్రూట్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం.. వివిధ ప్రాంతాలకు పంపించడం ఈ క్యాంపు పని. 

►ALSO READ | రాష్ట్రపతితో ప్రధానిమోదీ భేటీ..‘‘ఆపరేషన్ సిందూర్’’పై వివరణ