వాషింగ్టన్: తాను భారత మూలాలున్న అమెరికా బిడ్డను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ అన్నారు. వివక్షకు తావు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమెరికా అమలుచేస్తోందని ఆమె కొనియాడారు. ఇండియా నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన తనకు యునైటెడ్ నేషన్స్‌లో అమెరికా రాయబారి పదవి దక్కడమే అందుకు నిదర్శనమన్నారు. 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆమె పోటీపడుతున్నారు. ఇందుకు సౌత్ కరోలినా వేదికగా నిక్కీ హేలీ గురువారం ప్రచారం ప్రారంభించారు. అమెరికా చరిత్రలో మైనార్టీ వర్గం నుంచి గవర్నర్‌గా ఎంపికైన తొలి మహిళను తానేనని నిక్కీ పేర్కొన్నారు. ‘‘జో బైడెన్ హయాంలో దేశాన్ని దూషించే వారి సంఖ్య పెరిగింది. దేశంలో విద్వేషం పెరిగింది.. దేశం గాడి తప్పింది అనే దుష్ప్రచారం చేస్తున్నది అలాంటి వాళ్లే. స్వయంగా బైడెన్ కూడా అమెరికా రేసిస్టు దేశమని అంటున్నారు. నేను చెబుతున్నా అమెరికా రేసిస్టు దేశం కానే కాదు” అని నిక్కీ హేలీ కామెంట్ చేశారు.
