సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో భాగంగా సోమవారం సాయంత్రంతో ప్రచార పర్వం ముగిసింది. కాంగ్రెస్ తరపున మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, అజారుద్దీన్, ఎంపీ సురేశ్ షెట్కార్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీశ్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ తరపున ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రచారం నిర్వహించి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు.15 రోజులుగా బల్దియాల్లో మైకుల మోత మార్మోగింది.
ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు సైతం సొంత మేనిఫెస్టోలతో ప్రచారం నిర్వహించి ఓటర్లను ఆకర్షించారు. మెదక్ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటా పోటీగా ర్యాలీలు, రోడ్ షో నిర్వహించాయి. మైకుల హోరు, నినాదాల జోరుతో పట్టణం హోరెత్తింది. బీఆర్ఎస్ పట్టణంలోని అన్ని వార్డుల నించి ప్రజలు, పార్టీ కార్యకర్తలను రప్పించి సీఎస్ఐ గ్రౌండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.సాయంత్రం కాంగ్రెస్ అన్ని వార్డుల నుంచి తరలి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలతో జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించింది.
