క్రెడిట్ కార్డులతో పెట్టుబడులు పెడుతున్నారా..?

క్రెడిట్ కార్డులతో పెట్టుబడులు పెడుతున్నారా..?

వెలుగు, బిజినెస్​: క్రెడిట్ కార్డుల వాడకంలో చాలా మార్పులు వచ్చాయి.  షాపింగ్ లేదా ప్రయాణ ఖర్చులకు మాత్రమే ఇవి పరిమితం కావడం లేదు. ఈఎంఐ, ఎస్​ఐపీ, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, చిన్న మొత్తాల పొదుపుకు కూడా వాడుకోవడం పెరుగుతోంది. పైపైన చూస్తే ఇది ఎంతో సౌకర్యంగా అనిపిస్తుంది కానీ ఇలా చేయడం సరికాదు. రివార్డు పాయింట్లు రావడం,  అదనపు బిల్లింగ్ సైకిల్ లభించడం, అన్ని రకాల చెల్లింపులను ఒక చోట చూసుకోవడం వంటి లాభాలు కనిపిస్తాయి.   ఈఎంఐలు లేదా పెట్టుబడులకు క్రెడిట్ కార్డును వాడటం మొదలుపెట్టిన తొలి కొన్ని నెలలు అంతా బాగున్నట్టే భ్రమ కలుగుతుంది. ఎందుకంటే బిల్లు చెల్లించడానికి 50 రోజుల వరకు గడువు ఉంటుంది. నగదు వెంటనే బ్యాంకు ఖాతా నుంచి పోదు. అయితే, ఆదాయం రావడం ఆలస్యం అయినప్పుడు, క్రెడిట్ కార్డుతో ముడిపడిన ఖర్చులు ఒకేసారి పెరిగినప్పుడు ఇబ్బందులు వస్తాయి. బిల్లు మొత్తాన్ని గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే  క్రెడిట్ కార్డులపై పడే రోలోవర్ వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది.  ఏదైనా లోన్​పై ఉండే వడ్డీ కంటే లేదా పెట్టుబడి ద్వారా వచ్చే లాభం కంటే ఇది ఎంతో ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా నెలల తరబడి చేసిన ఆర్థిక ప్రణాళిక మొత్తం దెబ్బతింటుంది. 

అప్పు పెట్టుబడి కాదు...

అప్పుతో పొదుపును ముడిపెట్టడం సరైన పద్ధతి కాదు. క్రెడిట్ కార్డు అనేది ఒక అప్పు అని గుర్తుంచుకోవాలి. మ్యూచువల్​ ఫండ్​ సిప్, బ్యాంకుల ఆర్​డీ వంటి వాటిని కార్డు ద్వారా చెల్లించడం అంటే అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టడమే అవుతుంది. మార్కెట్ ఒడిదుడుకులకు గురైనప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. కార్డుపై మీరు పరోక్షంగా చెల్లిస్తున్న వడ్డీ కంటే మీ పెట్టుబడి వృద్ధి తక్కువగా ఉంటే ఆ పెట్టుబడికి అర్థం ఉండదు. లోన్​ ఈఎంఐల కోసం కార్డును వాడటం వల్ల భారం తగ్గదు. అది కేవలం భారాన్ని ఒక చోట నుంచి మరో చోటికి మార్చడమే అవుతుంది. క్రెడిట్ కార్డు పేమెంట్ మిస్ కావడం అనేది ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడానికి సంకేతం. దీంతో క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.  కార్డు పరిమితి మనకు ఒక తప్పుడు భరోసాను ఇస్తుంది.   పొదుపు చేయాలనే క్రమశిక్షణ తగ్గిపోతుంది. కేవలం కార్డులో సౌకర్యం ఉంది కదా అని పెట్టుబడులు పెట్టే అలవాటు పెరుగుతుంది. నిజమైన ఆర్థిక ప్రణాళిక అనేది మిగులు నగదు నుంచి రావాలి తప్ప, అప్పుగా తీసుకున్న మొత్తం నుంచి కాదు.   పెట్టుబడి కోసం క్రెడిట్ కార్డు వాడాలనుకునే వారు ప్రతి నెలా పూర్తి బిల్లు కచ్చితంగా చెల్లిస్తామనే నమ్మకం ఉన్నప్పుడే ఆ పని చేయాలి. స్వల్ప కాల నగదు అవసరాల కోసం ఈఎంఐ వాయిదాలకు కార్డును వాడటం అసలు మంచిది కాదు.