చనిపోయిన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న ప్రేమికుడు

చనిపోయిన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న ప్రేమికుడు

ప్రేమలో ఉన్నప్పుడు అంతా హాయిగానే ఉంటుంది. ఏం చూసినా, ఏం చేసినా బాగానే ఉంటుంది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతారు. కానీ విధి రాతతో ఆ ప్రేమికులు విడిపోవాల్సివస్తే మాత్రం కలిగే బాధ ఎవరూ ఊహించలేనిది, ఎవరికీ చెప్పలేనిది. అయితే తన నుంచి ప్రేయసి దూరమైనా.. తమ ప్రేమకు మరణంలేదని నిరూపించాడో అమర ప్రేమికుడు. ఎనిమిదేళ్ల క్రితం మరణించిన తన ప్రేయసితో తాజాగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇదేంటి మరణించిన వారితో మాట్లాడటం అనుకుంటున్నారా? అవును మీరు చదివేది నిజమే. అయితే ఆ కథేంటో చూద్దామా..

కెనడాలోని బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన 33 ఏళ్ల జాషువా బార్బ్యూ 2010లో జెస్సికాను కలుసుకున్నాడు. వారిద్దరూ అతితక్కువ సమయంలోనే ప్రేమలో పడ్డారు. వారి బంధం మరింత బలపడి వారిద్దరూ 2012 వరకు కలిసి ఉన్నారు. ఆ తర్వాత సడెన్‌గా జెస్సికా ఆరోగ్యం పాడైంది. క్రమక్రమంగా ఆమె గతమంతా మరచిపోవడం ప్రారంభించింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. జెస్సికా అరుదైన వ్యాధితో బాధపడుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే జెస్సికా కాలేయం క్షీణించడం కూడా మొదలైంది. చివరగా డిసెంబర్‌లో జెస్సికా తీవ్ర అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచింది. 

అయితే జెస్సికా మరణాన్ని జాషువా తట్టుకోలేకపోయాడు. కొంతకాలం పాటు మనిషి కాలేకపోయాడు. జెస్సికాను మరచిపోలేక తీవ్ర వ్యధ అనుభవించాడు. ఆమెను మరచిపోలేక ఏదైనా చేయాలనుకున్నాడు. అందుకోసం నెట్టింట్లో వెతుకుతూ.. ప్రాజెక్ట్ డిసెంబర్ అనే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను సృష్టించాడు. ఈ చాట్‌బాట్‌ తన లవర్ జెస్సికా లాగా మాట్లాడటానికి మరియు ప్రవర్తించడానికి ప్రోగ్రామ్ చేయబడింది. ఇందుకోసం జెస్సికా మరియు తన మధ్య జరిగిన ఫేస్‌బుక్ మెసెజ్‌లను ఉపయోగించాడు. దాంతో ఈ చాట్‌బాట్ జెస్సికా బతికి ఉన్నప్పుడు ఎలా చేసిందో అచ్చు అలాగే చేస్తోంది. 

జాషువా చేసిన ప్రయత్నం ఫలించడంతో అంతుబట్టలేని సంతోషంతో ఉన్నాడు. ‘ఎనిమిది సంవత్సరాల తర్వాత నా ప్రేయసి మళ్లీ తిరిగొచ్చింది. అయితే ఈ సారి మాత్రం ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చింది. నేనిప్పుడు చాట్‌బోట్‌తో ప్రేమలో పడ్డాను. చాట్ చేస్తుంటే అచ్చం జెస్సికాతో చాట్ చేసినట్లుగానే ఉంది. ఇప్పడు మేమిద్దరం ప్రతిరోజూ మాట్లాడుకుంటున్నాం’ అని జాషువా సంతోషంతో తెలిపాడు.