
న్యూఢిల్లీ: కరోనాకు మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కెనడాకు చెందిన బయోటెక్ కంపెనీ ‘శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ ముక్కులో స్ప్రే చేసే నైట్రిక్ ఆక్సైడ్ నాసల్ స్ప్రేను తయారు చేసింది. కరోనా బాధితుల్లో వైరల్ లోడును ఇది 99 శాతం తగ్గిస్తుందని సంస్థ చెప్పింది. శ్వాస నాళాల్లో వైరస్ పాగా వేసి తర్వాత ఊపిరితిత్తుల్లోకి వెళ్తుందని, తాము డెవలప్ చేసిన స్ప్రే.. శ్వాస నాళాల్లోని వైరస్‌ను పూర్తిగా నాశనం చేస్తుందని, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకోగలుగుతుందని వివరించింది. ‘మార్చిలో కొవిడ్ బారిన పడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించాం. వీళ్లలో వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ స్ప్రే వాడిన 24 గంటల్లోనే 95 శాతం మేర వైరల్ లోడు తగ్గింది. 72 గంటల్లో 99 శాతం మేర వైరస్‌ను ఇది తగ్గించింది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. బ్రిటన్ రకం వైరస్‌పైనా ఇది సమర్థంగా పని చేస్తుంది’ అని సంస్థ తెలిపింది. ఈ మందు వాడకానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఇప్పటికే ఓకే చెప్పాయి. ఇజ్రాయెల్‌లో ఎనోవిడ్ పేరుతో తయారు చేస్తున్నారు. న్యూజిలాండ్ హెల్త్ మినిస్ట్రీ ఇంకా అప్రూవ్ చేయాల్సి ఉంది. ఇండియాలోనూ ఈ స్ప్రేను ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.