- ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసిన అభ్యర్థులు
- ఇవ్వాల రీచెక్ చేయనున్న రివ్యూ కమిటీ
హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫైనల్ ‘కీ’లోనూ తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించిన పుస్తకాల్లోని అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సోమవారం స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను అభ్యర్థులు కలిశారు. ఎస్జీటీ క్వశ్చన్ పేపర్లలో పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు. రెండు క్వశ్చన్లు ఇటీవల జరిగిన టెట్ ఎగ్జామ్‌లోనూ వచ్చాయని, వాటిలో ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చి, ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా పేర్కొన్నారని వివరించారు. వీటికి సంబంధించిన ఆధారాలను ఆయనకు అందజేశారు.
దీనికి స్పందించిన లింగయ్య.. అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరోసారి రివ్యూ కమిటీకి పంపిస్తామని వెల్లడించారు. మంగళవారం వాటిని కమిటీ రివ్యూ చేయనుంది. డీఎస్సీలో ప్రతి మార్కు కీలకంగా మారడం, ఐదారు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఇటీవల డీఎస్సీ ఫైనల్ రిలీజ్ చేయగా, అందులో ఒక్కో సెషన్‌కు ఒక్కో క్వశ్చన్ పేపర్ కేటాయించినందున మొత్తం 109 ‘కీ’లను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో మొత్తం 59 క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను యాడ్ చేసి, మెరిట్ లిస్టు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారిగా సబ్జెక్టులు, మీడియం వారిగా మెరిట్ లిస్టులు ఇవ్వనున్నారు.