- రూల్స్ బ్రేక్ చేస్తే అనర్హతే
- బ్యాంకు ఖాతా తెరవాల్సిందే.. ఖర్చు లెక్క చెప్పాల్సిందే
- గైడ్ లైన్స్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పంచాయతీ పోరుకు అభ్యర్థులు సై అంటే సై అంటున్నారు. ఎలాగైనా సరే, ఎంత ఖర్చయినా సరే సర్పంచ్ పీఠంపై పాగా వేయాలని భావిస్తున్నారు. కానీ ఎన్నికల సంఘం మాత్రం అభ్యర్థుల జోరుకు కళ్లెం వేస్తోంది. ఎన్నికల కోసం ఇష్టారీతిన ఖర్చు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది.
ఎలా పడితే అలా ప్రచారం చేస్తామంటే కుదరదని, పొలింగ్ ఏజెంట్లను ఇష్టానుసారం పెట్టుకుంటామంటే రూల్స్ ఒప్పుకోవని చెప్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ఏం చేయాలనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) ప్రత్యేక గైడ్ లైన్స్ ఇచ్చింది.
ఖర్చుపై నిఘా..
ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా తెరవాల్సిందేనని ఎస్ఈసీ నియమావళి స్పష్టం చేస్తోంది. నామినేషన్ వేస్తున్నప్పుడు సంబంధిత రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా అభ్యర్థి ఈ బ్యాంక్ ఖాతా వివరాలు తప్పకుండా చెప్పాలి. ఈ అకౌంట్ నుంచే అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని ఖర్చు చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ రోజువారీ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాలు చూపించాలి.
అభ్యర్థులు రోజువారీ ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు పంపించాలి. . ఎన్నికల్లో పోటీచేసేవారు చేస్తున్న ప్రచార ఖర్చు, ఇతరత్రా వ్యయం వివరాలు తెలుసుకునేందుకు ఎన్నికల పరిశీలకులను నియమించారు. వారు అభ్యర్థుల ఖర్చులపై నిఘా
పెట్టనున్నారు.
అక్కడ ఓటు హక్కు ఉన్నవారే ఏజెంట్
సర్పంచ్ అభ్యర్థి నియమించుకునే పోలింగ్ ఏజెంట్లు సంబంధిత గ్రామ పంచాయతీలో నివసిస్తూ, ఓటరుగా నమోదై ఉండాలి. ఓటరు ఫొటో గుర్తింపు కార్డు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఏదైనా ఇతర గుర్తింపు డాక్యుమెంట్ కలిగి ఉండాలి. దీనివల్ల పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందని ఎస్ఈసీ భావిస్తోంది. మరోవైపు,ప్రచారం పేరుతో ఊరంతా హోరెత్తించడంతోపాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ప్రచారానికి వాడే వాహనాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేని వాహనాలను సీజ్ చేస్తారు. ఉదయం 6 నుంచి రాత్రి10 వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లు వాడాలి. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికితే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. జైలుశిక్షతో పాటు జరిమానా కూడా ఉంటుంది.
