- రెండో విడతలో అభ్యర్థుల ఎంపికపై చర్చ
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాలకు ఒకవైపు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కాగా, మరోవైపు రెండో విడత పోలింగ్ జరిగే గ్రామాలకు నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. కొన్ని గ్రామాల్లో నామినేషన్ల ఉప సంహరణపై చర్చలు, బుజ్జగింపులు నడుస్తుండగా, మిగిలిన చోట్ల ఎవరు నామినేషన్ వేయాలనే అంశంపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థిగా ఒకరు నామినేషన్ వేస్తు, వారికి వ్యతిరేకంగా, రెబల్స్ గా నామినేషన్ వేసిన వారిని ఉపసంహరింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
దీంతో అన్ని గ్రామాల్లో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందడే కనిపిస్తోంది. జిల్లాలో శనివారం రాత్రి వరకు మొదటి దశ పోలింగ్ జరిగే గ్రామాల్లో నామినేషన్ల దాఖలు కొనసాగగా, మొత్తం 192 గ్రామాల్లో సర్పంచ్ కోసం 1,142 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. వీటిలో చివరి రోజే ఏకంగా 884 నామినేషన్లు వచ్చాయి. ఇక 1,740 వార్డుల కోసం 4,056 నామినేషన్లు రాగా, వీటిలో చివరి రోజు 3,667 నామినేషన్లు ఫైల్ అయ్యాయి.
మధిర నియోజకవర్గంలో రెండు వార్డు స్థానాలు మాత్రం నామినేషన్ల గడువు ముగిసినా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతకాని మండలం రాఘవాపురంలో ఒకటో వార్డు బీసీ మహిళకు రిజర్వు కాగా, గ్రామంలో అభ్యర్థి లేకపోవడంతో నామినేషన్ దాఖలు కాలేదు. ఎర్రుపాలెం మండలం కాచవరంలో 7 వార్డు అన్ రిజర్వ్డ్ ఉమెన్ రిజర్వేషన్ ఉండగా, పురుష అభ్యర్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో రిజెక్ట్ కావడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
వార్డు మెంబర్ల ఖర్చు సర్పంచ్ అభ్యర్థులదే..!
ఎన్నికల ఖర్చులు రూ.లక్షలు దాటుతున్న ఈ సందర్భంలో చాలా గ్రామాల్లో వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు జనం ఆసక్తి చూపించడం లేదు. రాజకీయ పదవులపై ఆశలు ఉన్న వారు సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ గా ఉండగా, వాళ్ల టీమ్ తరఫున వార్డు మెంబర్లను కూడా సర్పంచ్ పోటీ దారుడే ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్నికలయ్యే ఖర్చు తానే భరిస్తానని, పోటీలో ఉండాలంటూ అభ్యర్థులను ఒప్పిస్తున్నారు. ఎమ్మెల్యే, ముఖ్య నేతలను ఒప్పించుకుని పార్టీ మద్దతు దక్కించుకున్న వారే వార్డు మెంబర్ల ఎలక్షన్ ఖర్చు భరించాల్సి వస్తోంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగింది. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 159 గ్రామపంచాయతీ సర్పంచ్‌లకు 813 నామినేషన్లు, 1,436 వార్డు మెంబర్ల స్థానాలకు 3,485 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లకు చివరి రోజైన శనివారం ఒక్కరోజే 614 సర్పంచ్ పదవులకు, 3,020వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. మూడు వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపహాడ్, చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం, మణుగూరు, పినపాక మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలతో పాటు 1436 స్థానాలకు నామినేషన్లను ఎన్నికల అధికారులు తీసుకున్నారు.
కాగ, చర్ల మండలంలోని కొత్తపల్లి, పూసుగుప్ప వార్డు సభ్యుల స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. నామినేషన్ వేసేందుకు ఓటర్లు ఇంట్రస్ట్ చూపలేదు. అశ్వాపురం మండలంలోని రామచంద్ర పురం పంచాయతీలోని ఏడు వార్డు ఎస్సీకి రిజర్వేషన్ అయింది. ఇక్కడ ఐదుగురు ఓటర్లు మాత్రమే ఎస్సీలున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్‌గా ఉన్న ఒక్కరు నామినేషన్ వేశారు. మిగిలిన నలుగురు నామినేషన్ వేసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు. గవర్నమెంట్ ఉద్యోగి నామినేషన్‌ను నామినేషన్ల పరిశీలనలో పరిశీలించనున్నారు.
రెండో విడతకు నామినేషన్లు
ఖమ్మం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న 183 గ్రామాల్లో సర్పంచ్ కోసం 45 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ గ్రామాల్లో 1,686 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, వాటికోసం తొలిరోజు 36 నామినేషన్లు ఫైలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చంద్రుగొండ, పాల్వంచ మండలాల్లో 155 పంచాయతీలకు గాను 21 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 1,384 వార్డులకు గాను 46 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో మొదటి విడత నామినేషన్ల వివరాలు..
మండలం గ్రామాలు సర్పంచ్ వార్డులు నామినేషన్లు
నామినేషన్లు
కొణిజర్ల 27 194 254 632
రఘునాథపాలెం 37 254 308 795
వైరా 22 133 200 440
బోనకల్ 22 108 210 500
చింతకాని 26 161 248 626
మధిర 27 146 236 525
ఎర్రుపాలెం 31 146 284 536
మొత్తం 192 1142 1740 4054
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొదటి విడత నామినేషన్ల వివరాలు..
మండలం గ్రామాలు సర్పంచ్ వార్డులు నామినేషన్లు
నామినేషన్లు
అశ్వాపురం 24 132 214 533
భద్రాచలం 01 11 20 98
బూర్గంపహడ్ 18 114 182 483
చర్ల 26 134 232 485
దుమ్ముగూడెం 37 153 324 648
కరకగూడెం 16 67 130 278
మణుగూరు 14 83 132 431
పినపాక 23 119 202 529
మొత్తం 159 813 1436 3480
