మాకే చాన్సివ్వండి..బడా లీడర్లను కోరుతున్న ఆశావహులు

మాకే చాన్సివ్వండి..బడా లీడర్లను కోరుతున్న ఆశావహులు
  • మళ్లీ రిజర్వేషన్లు అనుకూలించకపోవచ్చునని ఆందోళన
  • అధికార పార్టీ నుంచి భారీ నామినేషన్లు
  • మొదలైన బుజ్జగింపుల పర్వం 

మహబూబాబాద్, వెలుగు: ఈ సారి ఎలాగైనా తమకు సర్పంచ్​ గా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్​ గ్రామస్థాయి లీడర్లు బడా నాయకులను కోరుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసిన ఆశావహులు ఈ సారి తమ గ్రామంలో రిజర్వేషన్​అనుకూలంగా వచ్చిందని.. రోటేషన్​లో మళ్లీ అవకాశం ఎప్పుడొస్తుందో తెలియదని కాబట్టి తమకే చాన్స్​ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఒక్కో గ్రామం నుంచి ఐదారుగురు నామినేషన్ఉల వేయడంతో మండల, జిల్లా స్థాయి నాయకులు రంగంలోకి దిగారు. 

తొలి విడత నామినేషన్ల స్వీకరణ శనివారం రాత్రి వరకు కొనసాగింది. జీపీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటాలని వివిధ పార్టీలకు చెందిన లోకల్​ లీడర్లు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బల రాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి వర్గీయులు ఎవరికివారే పోటీలో నిలిచారు. తమకే అవకాశం ఇవ్వాలని నామినేషన్లు వేసినవారు పట్టుదలతో ఉండడంతో ఎవరిని బుజ్జగించాలో అర్థం కాక నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

 నెల్లికుదురు మండలం నెల్లికుదురు, నైనాల, మాకెఉమునిగలవీడు గ్రామాలతో పాటు గూడురు మండలంలో పొనుగోడు, రాములుతండా, ముచ్చెర్ల,గోవిందాపురం, అప్పిరాజుపల్లిలో ల్లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత తండా సోమ్లాతండాతోపాటు, కంబాలపల్లి, చోక్లాతండా లాంటి 15 గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్​బెడదను ఎదుర్కోబోతోందని అంటున్నారు. కేసముద్రం మండలంలో కోమటిపల్లి, కల్వల, ఉప్పరపల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే మురళీనాయక్​, సీఎం సలహాదారు వేం నరేందర్​ రెడ్డి అనుచరులు పోటీ పడుతున్నారు. 

రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్​ నెలకొంది. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగకున్నా చాలాకాలంగా జెండా మోస్తున్నతమకు అవకాశం ఇవ్వాలని గ్రామస్థాయి నేతలు కోరుతున్నారు. ఒక్కో గ్రామంలో నలుగురైదుగురు సర్పంచ్​ పదవిని ఆశించి నామినేషన్లు వేయడంతో ఏకాభిప్రాయం ద్వారా అభ్యర్థులను ఖరారు చేయాలని మండల స్థాయి నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. అయినా విత్​ డ్రా చేసుకునేందుకు ఒప్పుకోకపోతే ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులు ఆశావహులతో మాట్లాడాలని భావిస్తున్నారు. రెబల్స్​బెడదను నివారించి పంచాయతీల్లో క్లీన్​స్వీప్​ చేయాలని పార్టీ నాయకత్వం ఆశిస్తుంది. 

జిల్లాలో తొలివిడత నామినేషన్లు ఇలా ఉన్నాయి 

మండలం     జీపీలు     నామినేషన్లు     వార్డులు     నామినేషన్లు

గూడురు          41              329                   354                1048
ఇనుగుర్తి         13              109                   112                  296
కేసముద్రం    29              233                   254                  658
మహబూబాబాద్​     41   310                    338                   844
నెల్లికుదురు     31           258                   280                     650