విజయానికి వ్యూహాలు..కామారెడ్డి జిల్లాలో ప్రధాన పార్టీల కసరత్తు

విజయానికి వ్యూహాలు..కామారెడ్డి జిల్లాలో ప్రధాన పార్టీల కసరత్తు
  • పార్టీ తరఫున ఒకే అభ్యర్థి ఉండేలా దిశానిర్ధేశం
  • రెబల్స్​ను బుజ్జగింపు, సమన్వయంతో పని చేయాలని సూచన

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో పంచాయతీ ఎన్నికల హీట్​ షురూ అయ్యింది. గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు మొదలుపెట్టారు. క్షేత్రస్థాయిలో తమ బలాన్ని నిరూపించుకోవాలని లీడర్లు ముమ్మరంగా యత్నిస్తున్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ లీడర్లు గెలుపే లక్ష్యంగా తొలి, మలి విడత పోరుకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. రెబల్స్​ లేకుండా ఒక్కో పార్టీ నుంచి ఒకే అభ్యర్థిని ఎంపిక చేసి మండల, నియోజకవర్గస్థాయి నాయకులు పంచాయతీ ఎన్నికల రణరంగంలోకి దిగారు. 

జిల్లాలోని 532 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ విడత కామారెడ్డి డివిజన్​లోని 10 మండలాల్లో 167 పంచాయతీలు, సెకండ్ విడత ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని 7 మండలాల్లో 197 పంచాయతీలు, థర్డ్ విడత  బాన్సువాడ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లోని 168 పంచాయతీల్లో పల్లెపోరు జరగనున్నది.

 ఫస్ట్ విడత నామినేషన్లు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. పార్టీల పెద్దలు విభేదాలు తగ్గించే ప్రయత్నాలు చేస్తూ విజయానికి కసరత్తులు చేస్తున్నారు. కుల, యువ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు చర్చిస్తున్నారు. సపోర్టర్లు, కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించి ఇంటింటి ప్రచారం కోసం సన్నద్ధమవుతున్నారు.  

రెబల్స్​ను బుజ్జగింపు..  

పంచాయతీ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు వేశారు. కొన్ని పంచాయతీల్లో ప్రధాన పార్టీల నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ప్రధాన పార్టీల నేతలకు సవాల్​గా మారింది.  విభేదాలను పక్కనపెట్టి పార్టీ నుంచి ఒక్కరే బరిలో ఉండేలా బుజ్జగిస్తున్నారు. నామినేషన్ల విత్‌‌‌‌‌‌‌‌‌‌డ్రాకు సమయం ఉండగా ఆదివారం చర్చల పర్వం మొదలైంది. రెబల్స్​కు నచ్చజెప్పే బాధ్యతను ప్రధాన పార్టీలు మండల నాయకులకు అప్పగించాయి. అవసరమైతే నియోజకవర్గానికి చెందిన ప్రధాన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరు పోటీలో నిలవాలి, ఎవరు విత్‌‌‌‌డ్రా చేసుకోవాలో దిశానిర్ధేశం చేయనున్నారు.  

సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధం 

అధికారకాంగ్రెస్ సత్తా చాటేందుకు పంచాయతీ ఎన్నికలపై ఫోకస్​పెట్టింది. బీసీల 42 శాతం రిజర్వేషన్​ నేపథ్యంలో, జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలో మెజార్టీ స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పంచాయతీల్లో ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ షబ్బీర్ అలీ నామినేషన్లు వేసిన అభ్యర్థులతో చర్చిస్తున్నారు.   స్థానిక లీడర్ల ఫీడ్‌‌‌‌బ్యాక్‌‌‌‌తో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు నామినేషన్లు వేసిన అభ్యర్థులను కలిసి అవసరమైన ప్రచార వ్యూహాలు, మద్దతుదారుల సర్దుబాట్లు, గ్రామస్థాయి లీడర్ల సమన్వయం వంటి అంశాలపై సూచనలు చేస్తున్నారు. జుక్కల్‌‌‌‌ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు రెండు, మూడు విడతల్లో జరగనున్నాయి.  ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇప్పటికే తన పరిధిలోని గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ గెలుపు అవకాశాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.  

ఉనికి కోసం బీఆర్‌‌‌‌ఎస్   

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న బీఆర్‌‌‌‌ఎస్ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఉనికిని చాటేందుకు యత్నిస్తోంది.  బలమైన అభ్యర్థులను పోటీలో నిలబెట్టేందుకు నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు.  కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంతు శిండే, జాజలా సురేందర్ మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించారు. గ్రామాల రాజకీయ స్థితిగతులపై ఆరా తీస్తూ గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

 పార్టీ పటిష్టతను తిరిగి చాటుకునేందుకు, ఎక్కువ స్థానాల్లో విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫస్ట్ విడత మండలాల్లోని పంచాయతీల నాయకులకు  గంప గోవర్ధన్ సమావేశం నిర్వహించి సూచనలు చేస్తున్నారు. ఒక్కరే బరిలో ఉండేలా దిశానిర్ధేశం చేస్తున్నారు.   బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు బలం ఉన్న గ్రామాల్లో వ్యూహంతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకుని మళ్లీ పట్టు సాధించేందుకు ఆ పార్టీ నాయకులు  చురుకుగా పని చేస్తున్నారు.

క్షేత్ర స్థాయిలో బలం కోసం బీజేపీ 

క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. స్థానికంగా పట్టు ఉన్న, యువతను  సర్పంచ్ అభ్యర్థులుగా పోటీలో నిలుపుతున్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలిచారు.  పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు ఆయన సమాలోచనలుచేస్తున్నారు.   రిజర్వేషన్లకు అనుగుణంగా గ్రామాల్లో పట్టున్న నాయకులు, కార్యకర్తలను సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేయించారు.  తమ పార్టీ నుంచే ఒకరే అభ్యర్థి ఉండేలా దృష్టి పెట్టారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​లో కూడా  విజయం సాధించేలా స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారు.