
బషీర్‌బాగ్, వెలుగు: హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఈ నెల18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంఘీభావంగా తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీని నిర్వహించారు. నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర బంద్ లో సకల జనుల పాల్గొంటున్నారన్నారు.
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చే దాకా ఉద్యమించాల్సిందే: మహాజన సేన
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లను కల్పించే విషయంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మహాజన సేన రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో గురువారం బీసీ జాక్ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోనితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు పలికారు.
రాష్ట్రంలో విద్యా, కార్పొరేట్ రంగాలు అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయని, బంద్ విఫలం చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సైతం బీసీ రిజర్వేషన్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉందని, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ లో చేర్చే దాకా ఉద్యమించాల్సిందే స్పష్టం చేశారు.
నోటి కాడి ముద్ద లాక్కుంటున్నరు
శంషాబాద్: ఈ నెల18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.ఆర్.కృష్ణ ముదిరాజ్ కోరారు. గురువారం శంషాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత స్టే ఇవ్వడం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఇది బీసీల నోటి కాడి ముద్ద లాక్కోవడమేనన్నారు. 30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేసినా పిటిషనర్ల వాదనలు వినకుండా స్టే ఇవ్వడం అన్యాయమన్నారు.
వికారాబాద్: బీసీ బంద్‌కు వికారాబాద్‌లోని వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు కలిసి రావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ కోరారు. గురువారం బీసీ సంఘాల నాయకులతో వారు సమావేశం
నిర్వహించారు.