బార్లు, కాఫీ సెంటర్లలో  గంజాయి దందా!

V6 Velugu Posted on Sep 15, 2021

  • రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మకాలు
  • స్టూడెంట్లు, యూత్​కు అలవాటు చేస్తున్న దుండగులు 
  • డుంజో, ర్యాపిడోలో హషీష్​ ఆయిల్​ విక్రయాలు
  • సైదాబాద్​ చిన్నారి అత్యాచారం, హత్య గంజాయి మత్తులోనే

హైదరాబాద్​, వెలుగు: 3 దమ్ములు, 6 కిక్కులు చందంగా రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. కొన్ని కాఫీ సెంటర్లు, బార్లు, కాలేజీల్లో యువతకు ఆ మత్తును అంటగడుతున్నారు దుండగులు. ఫుడ్ డెలివరీ యాప్​ల ద్వారా కూడా సరఫరా చేస్తున్నారు. ఆ మత్తులో తూలిపోతూ నేరాలు చేస్తున్నారు. సింగరేణి కాలనీ చిన్నారి అత్యాచారం, హత్య ఈ గంజాయి మత్తులోనే జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాగా, ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు ఎక్సైజ్​ అధికారులు 172 డ్రగ్స్​ కేసులు నమోదు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆయా కేసుల్లో 305 మందిని అరెస్ట్​ చేసిన అధికారులు.. 3,300 కిలోల ఎండు గంజాయిని, 1,970 కిలోల గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. 64 వాహనాలను సీజ్​ చేశారు. ఎక్సైజ్​ అధికారులు కాకుండా పోలీసులు, డీఆర్​ఐ అధికారులూ మరికొన్ని కేసులను నమోదు చేశారు.  
సారా బ్యాన్​ కావడంతో.. 
డబ్బును ఈజీగా సంపాదించాలన్న ఆశతో కొందరు గంజాయి రవాణాను మార్గంగా ఎంచుకుంటున్నారు. కొన్ని ముఠాలు ఆ వ్యాపారాన్ని విస్తరించేస్తున్నాయి. ఏపీలోని విశాఖపట్నం నుంచి రాష్ట్రానికి గంజాయి ఎక్కువగా సరఫరా అవుతోంది. సరిహద్దులను దాటించేందుకు డ్రగ్స్​ స్మగ్లర్లు.. గంజాయిని ప్లాస్టిక్​ కవర్లలో చుట్టి లారీల్లో బొగ్గు పొడి కింద పెట్టి పంపిస్తున్నారు. పైపుల్లో, ఫ్లై యాష్​ ఇటుకల్లో పెట్టి బార్డర్​ దాటిస్తున్నారు. గంజాయి వాసన రాకుండా గట్టిగా ప్యాక్​ చేస్తున్నారు. అలా బార్డర్లు దాటిన గంజాయిని బైకులు, ఆటోల్లోనే సిటీలో సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో సారాను బ్యాన్​ చేయడంతో.. ఆ వ్యాపారం చేసేటోళ్లే ఇప్పుడు గంజాయి దందాను చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని ధూల్​పేట, మంగళ్​హాట్​, పాతబస్తీలోని ఫలక్​నుమా, ఉప్పుగూడ, పురానాపూల్​, జియాగూడ బస్తీల్లో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. 
ఆన్​లైన్​లో హషీష్​ ఆయిల్​
గంజాయి ఆకుల నుంచి తీసే హషీష్​ ఆయిల్​ అమ్మకాలూ సిటీలో జోరుగా సాగుతున్నాయి. గంజాయితో పోలిస్తే దీని నుంచి వచ్చే మత్తు నాలుగు రెట్లుంటుందని చెప్తుంటారు. విశాఖ ఏజెన్సీలో తయారవుతున్న ఈ ఆయిల్​ను.. చిన్న చిన్న డబ్బాలు, ప్యాకెట్లలో నింపి మన రాష్ట్రానికి పంపిస్తున్నారు. వీటి దందాకు ఈ–కామర్స్​ సైట్లతో పాటు ఫుడ్​ డెలివరీ యాప్​లనూ దుండగులు వాడుకుంటున్నారు. డెలివరీ బాయ్స్​కు ఈ దందా గురించి తెలియకుండా పనికానిచ్చేస్తున్నారు. డుంజో, ర్యాపిడో వంటి యాప్​ల ద్వారా కోరిన చోటుకు డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఇలాంటి కేసులు హైదరాబాద్​ సిటీలో కూడా బయటపడ్డాయి.  

మత్తు చాటు నేరాలు
సైదాబాద్​లోని సింగరేణి కాలనీకి చెందిన ఆరేండ్ల చిన్నారిని రాజు అనే యువకుడు అత్యాచారం చేసి చంపేశాడు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటుందని, ఆ మత్తులోనే దారుణం చేశాడని పోలీసులకు స్థానికులు చెప్తున్నారు. గతంలో జరిగిన హాజీపూర్​ ఘటనలోనూ నిందితుడు శ్రీనివాస్​.. గంజాయి తీసుకుని నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. గంజాయి తీసుకున్నోళ్లు ఎదుటివాళ్లపై అకారణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి.

స్టూడెంట్లు, యూతే టార్గెట్​
విద్యార్థులు, యువతనే కొందరు వ్యాపారులు టార్గెట్​ చేస్తున్నారు. వారికి గంజాయిని అలవాటు చేసి ఊబిలోకి దింపేస్తున్నారు. డ్రగ్స్​ కావాలనుకునే వారికి.. ఆ డ్రగ్స్​ను మరొకరికి విక్రయించే పనినీ అప్పజెప్తున్నారు. అలాగైతేనే గంజాయినిస్తామని కండీషన్​ పెడ్తున్నారు. దీంతో దానికి అప్పటికే అలవాటు పడిపోయిన కొందరు వ్యక్తులు.. వేరేవాళ్లకూ దానిని అంటగడుతున్నారు. వివిధ కోడ్​ భాషలతో డ్రగ్స్​ను అమ్ముతున్నారు. కాఫీ సెంటర్లు, బార్లు, పార్కులు, హుక్కా సెంటర్లు, క్లబ్​ ఏరియాలను అడ్డాలుగా చేసుకుని దందా సాగిస్తున్నారు. కొన్ని కాలేజీల్లోని స్టూడెంట్లకు గంజాయిని సరఫరా చేస్తున్నారని, ఆయా కాలేజీల గ్రౌండ్లలో గంజాయి దందా ఎక్కువగా నడుస్తోందని తెలుస్తోంది. 

ఇటీవల గంజాయి కేసులు 
ఆగస్టు 26 :     భద్రాచంలో వేర్వేరు ఘటనల్లో 14.6 లక్షల విలువైన 73 కిలోల  
    గంజాయిని పట్టుకుని, ఐదుగురిని అరెస్ట్​ చేశారు. 
ఆగస్టు 29 :     పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్న 14 కిలోల గంజాయిని 
    మిర్యాలగూడ వద్ద పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
ఆగస్టు 29 :     ఓఆర్​ఆర్​పై రూ.21 కోట్ల విలువైన 400 కిలోల గంజాయిని 
    స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్​ చేశారు.
సెప్టెంబర్​ 7 :     పఠాన్​చెరులో 70 గ్రాముల గంజాయి లిక్విడ్​ను పట్టుకున్నారు. 
సెప్టెంబర్​ 10 :    ఒడిశా నుంచి హైదరాబాద్​కు తరలిస్తుండగా భద్రాచలం ఫారెస్ట్​ చెక్​పోస్ట్​ వద్ద రూ.9.6 లక్షల విలువైన 48 కిలోల గంజాయిని పట్టుకొని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

Tagged Hyderabad, business, cannabis, bars, , coffee centers

Latest Videos

Subscribe Now

More News