
- మెదక్ జిల్లాలో పలుచోట్ల పట్టుబడుతున్న ఎండు గంజాయి
- విచ్చలవిడి అమ్మకాలతో బానిసవుతున్న యూత్
- రవాణా, అమ్మకాలపై ఇంటలిజెన్స్ ఆరా
మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, చేగుంట ప్రాంతాల్లో కొన్నాళ్లుగా ఎండు గంజాయి పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఇంటలిజెన్స్ వర్గాలు గంజాయి అమ్మకాలపై దృష్టిసారించాయి. ఇంకా ఎక్కడెక్కడ గంజాయి దొరుకుతోంది? ఎక్కడి నుంచి సప్లై అవుతోంది? ఎక్కడెక్కడ అమ్మకాలు సాగుతున్నాయి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.
మెదక్(శివ్వంపేట), వెలుగు: జిల్లాలో కొన్నాళ్లుగా గంజాయి రవాణా, అమ్మకాలు బాగా పెరిగాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారు లేబర్, యూత్, స్టూడెంట్స్ ను టార్గెట్‌గా చేసుకుని గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. ఇల్లీగల్ దందాలు చేసే కొందరు హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి చిన్న పాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. అనేక మంది గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఆరోగ్యం పాడుచేసుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
సిగరెట్లలో నింపి అమ్ముతున్నరు
మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలతోపాటు ఫ్యాక్టరీలు ఉన్న తూప్రాన్, మనోహరబాద్, శివ్వంపేట, చేగుంట, చిన్నశంకరంపేట మండలాల్లో గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేసే బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన లేబర్ గంజాయి తాగుతారు. దీన్ని ఆసరా చేసుకుని వారికి గంజాయి అమ్ముతున్నారు. ఎండుగంజాయి తీసుకొచ్చి 50, 100 గ్రాముల ప్యాకెట్లుగా చేసి ఆయా ప్రాంతాల్లోని పాన్ షాప్‌లు, కిరాణా షాపుల్లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల సిగరెట్లలోని ఎండు గంజాయి నింపి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. జూలై 19న మెదక్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో చిన్నయ్యగారి శ్రీకాంత్ అనే యువకుడి వద్ద 54 ఎండు గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూలై 25న మెదక్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు యువకులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో నర్సాపూర్ పట్టణంలో మూత పడిన ఓ స్కూల్ బిల్డింగ్ లో కొందరు యువకులు సిగరెట్, బీడీలలో గంజాయి నింపుకొని తాగుతుండగా స్థానికులు గుర్తించారు.
కొన్ని రోజుల కింద నర్సాపూర్‌లో ఎక్సైజ్ ట్రాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు దాడి చేసి వెయ్యి గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 6న శివ్వంపేట మండలం నవాపేట్ ఎల్లమ్మగుడి వద్ద పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు బైక్ పై వస్తున్న రవి అనే యువకుడిని ఆపి తనిఖీ చేశారు. 100 గ్రాముల చొప్పున ఉన్న 31 గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దుందిగల్ గ్రామానికి చెందిన అతడు ఎయిర్ పోర్ట్ లో కూలి పనికి వెళ్లేవాడు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో హైదరాబాద్ ధూల్ పేటకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి శివ్వంపేట మండలంలోని కంపెనీల్లో పనిచేస్తున్న బీహార్ కూలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.
అవేర్నెస్ కల్పించాలి
శివ్వంపేట మండలంలోని చాలా గ్రామాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా గంజాయికి అలవాటుపడుతున్రు. గంజాయి తాగిన యువకులు మత్తులో వెహికల్స్ స్పీడ్‌గా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసు, ఎక్సైజ్ ఆఫీసర్లు నిఘా పెంచాలి. గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలపై యూత్ కు అవేర్నెస్ కల్పించాలి. - పబ్బ మహేశ్ గుప్తా, శివ్వంపేట జెడ్పీటీసీ