ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్ లో వేర్పాటువాదుల ఆదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని పుతిన్ నిర్ణయించారు. డోనెట్స్ కో, లుహాన్స్ కో ను స్వతంత్ర స్టేట్స్ గా గుర్తిస్తూ ఫైల్ పై సంతకం చేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన పుతిన్.. అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యాను బలహీనపర్చే చర్యలకు అమెరికా దిగుతోందని పుతిన్ ఆరోపించారు. రష్యాపై దాడి చేయించేందుకు ఉక్రెయిన్ ను పావుగా వాడుకుంటుందని అన్నారు. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని.. ఏ సమయంలోనేనా దాడి చేసే ప్రమాదం ఉందని తెలిపారు పుతిన్.. నాటో హెడ్ క్వార్టర్స్ నుంచి ఉక్రెయిన్ ఆర్మీకి ఆదేశాలు అందుతున్నాయన్నారు. తమపై దాడికి వస్తే తిప్పికొడతామని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.
రష్యా దూకుడును అడ్డుకోండి
మరోవైపు పుతిన్ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలు రష్యా దూకుడును అడ్డుకోవాలని కోరింది. తాము ఎవరికీ భయపడమని ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. మాస్కో శాంతి చర్చలను ధ్వంసం చేశారని.. ప్రాదేశిక రాయితీలు ఇవ్వకూడదని జెలెన్స్కీ ఆరోపించారు. ఇక ఉక్రెయిన్ లోని రష్యా మద్దతు ఉన్న రెండు వేర్పాటువాద ప్రాంతాలపై త్వరలో ఆంక్షలు విధించనున్నట్లు అమెరికా ప్రకటించింది. డోనెట్స్ కో, లుహాన్స్ కో పీపుల్స్ రిపబ్లిక్ లను స్వతంత్రంగా గుర్తించాలని పుతిన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో ఎలాంటి కొత్త పెట్టుబడులు పెట్టబోమని వైట్ హౌస్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫైల్ పై బైడెన్ సంతకం చేశారు.
యూఎన్ భద్రతా మండలి అత్యవసర సమావేశం
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం అయ్యింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతపై రష్యా దాడి చేస్తోందని భద్రాతామండలిలో యూఎస్ రాయబారి లిండా థామస్ అన్నారు. అంతర్జాతీయ చట్టం యొక్క ప్రాథమిక సూత్రాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భద్రతామండలిలో భారత శాశ్వాత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. సంయమనం పాటించాలని ఇరుదేశాలకు సూచించారు. రష్యన్ ఫెడరేషన్ తో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ పరిణామాలు ఉక్రెయిన్ లో శాంతి, భద్రతలతో పాటు ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ లో సుమారు 20 వేల మందికి పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారని, వారి భద్రత తమకు టాప్ ప్రయారిటీ అని తెలిపారు. వీలైనంత త్వరగా రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాలు దౌత్యపరంగా చర్చించుకుని ఉభయ తారకమైన పరిష్కారానికి రావాలని సూచించారు.
