దారి కనిపించక.. ఊపిరాడక

దారి కనిపించక.. ఊపిరాడక

దారి కనిపించక.. ఊపిరాడక

టన్నెల్ నుంచి ఎస్కేప్ ఎగ్జిట్ దాకా వచ్చి ప్రాణాలు విడిచారు

నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్​ప్లాంట్ ప్రమాదంలో టన్నెల్ నిండా పొగ కమ్ముకోవడంతో దారి కనిపించక, ఊపిరి ఆడక తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. టెర్మినల్​ ప్యానెల్​లో చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలో జీరో బేస్ నుంచి టన్నెల్​ వరకు వ్యాపిం చడమే భారీ ప్రాణనష్టానికి కారణమైంది. విద్యుత్ జనరేటింగ్​ ప్లాంట్ లోని టెర్మినల్స్​ నుంచి బయటకు రావడానికి రెండు మార్గాలతో పాటు నేరుగా టన్నెల్​ వద్దకు వచ్చే దారి ఉంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఈ విషయం తెలిసినా పొగ కారణంగా ఏమీ కనిపించక.. ఊపిరాడక అక్కడే ప్రాణాలు వదిలినట్లు భావిస్తున్నారు.

మిన్నంటిన రోదనలు

తొమ్మిది మంది లోపల చిక్కుకున్నారని తెలుసుకున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు పాతాళగంగ ప్రాంతానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు తమ వారు సురక్షితంగా బయట పడతారనే ఆశతో ఊపిరి బిగపట్టి ఎదురుచూశారు. ముందుగా మంటలు అదుపులోకి వచ్చాక.. పొగ తీవ్రతను తగ్గిం చడానికి ఫైరింజన్లతో నీళ్లు చల్లి, వెంటనే అంబులెన్స్​లు లోపలికి వెళ్లడానికి రూట్ క్లియర్​ చేశారు. ఆ తర్వాత సీఐఎస్ఎఫ్ బలగాలు, సింగరేణి రెస్క్యూ టీమ్ లు లోపలికి వెళ్లగా.. వారికి ఎస్కేప్​ ఎగ్జిట్ వద్దే నాలుగు నుంచి ఐదు డెడ్​బాడీలు కనిపించాయి. అక్కడికి సమీపంలోనే మిగిలిన డెడ్​బాడీలు కనిపించాయి. ఒక్కో డెడ్​బాడీని బయటకు తెస్తున్న కొద్దీ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఆఫీసర్లు కూడా కంటతడి పెట్టారు. పొగచూరి నల్లగా గుర్తుపట్టనంతగా మృతదేహాలు మారిపోయాయి. మృతుల్లో ఐదేండ్ల కింద డ్యూటీలో చేరిన వారే ఎక్కువగా ఉన్నారు.