మాల్యా ఎప్పుడొస్తాడో చెప్పలేం: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

మాల్యా ఎప్పుడొస్తాడో చెప్పలేం: సుప్రీంలో కేంద్రం అఫిడవిట్

యూకే కోర్టు ప్రొసీడింగ్స్‌‌ గురించి తెలియదు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి పారిపోయిన లిక్కర్‌‌ వ్యాపారి విజయ్‌‌ మాల్యా గురించి యూకే కోర్టు ఏం చర్యలు తీసుకుంటున్నదనే విషయం తమకు తెలియదని కేంద్రం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌‌ ఇచ్చింది. అతణ్ని ఇండియాకు పంపించాలంటూ యూకే కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటికీ అమలు కాలేదని వెల్లడించింది. అక్కడి కోర్టులో నిందితుడిపై రహస్యంగా జరుగుతున్న విచారణకు సంబంధించిన వివరాలు తమ దగ్గర లేవని సొలిసిటర్‌‌ జనరల్‌‌ తుషార్‌‌ మెహతా జడ్జీలకు తెలియజేశారు.

ఇంగ్లండ్‌‌ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో ఇండియా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని, ఇందుకే కేసుకు సంబంధించిన వివరాలు తెలియవని అన్నారు. ఈ సందర్భంగా మాల్యా తరఫు లాయర్ మాట్లాడుతూ తన క్లయింటును ఇండియాకు ఎప్పుడు రప్పిస్తారో తెలియదని చెప్పారు. యూకే సుప్రీంకోర్టు విచారణ గురించి తెలియజేయాలని జడ్జీలు అడగగా, ఆయన పైవిధంగా జవాబు ఇచ్చారు. తన సంతానానికి అక్రమంగా నిధులను తరలించినందుకు విధించిన కోర్టు ధిక్కరణ కేసును మరోసారి పరిశీలించాలన్న మాల్యా రిక్వెస్ట్‌‌ను సుప్రీంకోర్టు ఇది వరకే తిరస్కరించింది. దివాలా తీసిన కింగ్‌‌ఫిషర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌ యజమాని అయిన మాల్యా ప్రభుత్వ బ్యాంకుల కన్సార్షియానికి రూ.తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టి ఇంగ్లండ్‌‌ పారిపోయిన సంగతి తెలిసిందే.