బీఆర్ఎస్​తో పొత్తుకు వెంపర్లాడుతలేం.. కేసీఆర్ పిలిస్తే మాత్రం కాదనం

బీఆర్ఎస్​తో పొత్తుకు వెంపర్లాడుతలేం.. కేసీఆర్ పిలిస్తే మాత్రం కాదనం

హుస్నాబాద్, వెలుగు : బీఆర్ఎస్ తో తాము పొత్తుకు వెంపర్లాడుతలేమని, కేసీఆర్ పిలిస్తే మాత్రం ఆ పార్టీతో జతగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్​రెడ్డి అన్నారు. సీపీఐ, సీపీఎం ఒకే గొడుగు కింద ఉన్నాయని చెప్పారు. కేంద్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని, లేకపోతే దేశం మొత్తం మణిపుర్ లా తగలబడుతుందన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్​క్లూజివ్ అలయన్స్ పేరుతో కూటమిగా ఏర్పడ్డాయని, తమ పార్టీ కూడా అందులో చేరిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ, టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రం అటూ ఇటూ కాకుండా ఉన్నాయన్నారు. లౌకిక, ప్రజాతంత్ర విధానాలు అవలంబించే తమతో సీఎం కేసీఆర్ కలిసి పనిచేస్తానని గతంలో చెప్పారని, ఇప్పుడు ఆయన వైఖరి ఏమిటో చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీతో కలుస్తుందా, తమతో పొత్తు కుదుర్చుకుంటుందా అనేది తెలియడంలేదన్నారు. పొత్తులపై తాము మాత్రం కేసీఆర్ ను అడిగేది లేదని, ఆయన తమతో కలిసి వస్తే కాదనేదిలేదన్నారు. రాష్ట్రంలో తమకు బలమున్న నియోజకవర్గాల్లో మాత్రం తప్పకుండా బరిలో ఉంటామని చెప్పారు. ఈ నెల 25న మణిపుర్ ప్రజలకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్టు చెప్పారు. 

తెలంగాణలో సేవ్ ఆర్టీసీ నినాదంతో ఈనెల 26 నుంచి 30 వరకు ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల నిధిని కూడా సీఎం కేసీఆర్ కార్మికులకు దక్కకుండా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తెచ్చి పేదల భూములను మాయం చేశారని మండిపడ్డారు. దళితబంధు, బీసీబంధు ధనవంతులబంధుగా మారిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు జాగీర్ సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు కోహెడ కొమురయ్య, యెడల వనేశ్, కొమ్ముల భాస్కర్, సుదర్శనాచారి పాల్గొన్నారు.