కంటోన్మెంట్ అధికారులు కళ్లు నెత్తికెక్కినట్లు మాట్లాడుతున్నరు.. కంటోన్మెంట్ బోర్టు మీటింగ్ బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

కంటోన్మెంట్ అధికారులు కళ్లు నెత్తికెక్కినట్లు మాట్లాడుతున్నరు.. కంటోన్మెంట్ బోర్టు మీటింగ్ బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • ప్రజా ప్రతినిధులను అవహేళన చేస్తున్నరు
  • ప్రజల సమస్యలపై మాట్లాడితే.. మాకు ఓటు హక్కు లేదంటున్నరు
  • రసాభాసగా కంటోన్మెంట్ బోర్టు మీటింగ్
  • బహిష్కరించిన ఎమ్మెల్యే శ్రీగణేశ్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం గురువారం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే శ్రీగణేశ్ బోర్డు సమావేశాన్ని బహిష్కరించారు. సర్క్యులర్ ఎజెండాలో ఉన్న అంశంపై చర్చించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఇటీవల ఎరుకల బస్తీలో పేదలు నిర్మించుకుంటున్న భవన నిర్మాణాన్ని నేలమట్టం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రాథమిక దశలోనే రక్షణ శాఖ స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. 

పేద ప్రజలకు జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. పేదలకు ఓ రకంగా.. పెద్దలకు మరో రకంగా న్యాయం చేయడం సమంజసం కాదని బోర్డులో ప్రస్తావించిండంతో.. సీఈఓ మధుకర్ నాయక్ స్పందించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు బోర్డు సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమేనని చెప్పారు. బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి ఓటు హక్కు కూడా లేదన్నారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు.

సీఈవో ప్రవర్తించిన తీరు సరిగాలేదు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేశ్ మాట్లాడుతూ.. ప్రజల కోసం వారి కష్టాలను బోర్డులో ప్రస్తావిస్తే తమ పట్ల సీఈవో ప్రవర్తించిన తీరు సరిగాలేదని ఆక్షేపించారు. అధికారులు కళ్లు నెత్తికెక్కినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అవమానించారన్నారు. 

ఓటింగ్ లేదు కనుక ఏమి మాట్లాడొద్దనడం ప్రజా ప్రతినిధులను అవహేళన చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై సీఈవో మధుకర్ నాయక్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ చట్టంలో ఉన్న అంశాన్ని మాత్రమే తాను బోర్డులో ప్రస్తావించినట్లు, ప్రజా ప్రతినిధులను అవమానపరిచే విధంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.