అమెరికా ఫ్లోరిడాలో కారు బీభత్సం.. నలుగురు మృతి..11 మందికి గాయాలు

అమెరికా ఫ్లోరిడాలో కారు బీభత్సం..  నలుగురు మృతి..11 మందికి గాయాలు

న్యూయార్క్: ఫ్లోరిడాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రేసింగ్ లో పాల్గొనడంతో పోలీసులు వెంటపడగా వారిని తప్పించుకునేందుకు డ్రైవర్  కారును మితిమీరిన వేగంతో నడిపాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఓ బార్ ఆవరణలోకి దూసుకెళ్లి అక్కడున్న వారిని ఢీ కొట్టింది.

 ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం వేకువజామున టంపా జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి స్ట్రీట్ రేసింగ్ లో పాల్గొని వేగంగా వెళ్తున్న కారును పోలీసులు గమనించి వెంబడించారు. పోలీసులు హెచ్చరిస్తున్నా కారు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. 

మితిమీరిన వేగం కారణంగా కారు అదుపుతప్పి నైట్ క్లబ్ వెలుపల ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి చికిత్స కోసం వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్​ ను సిలాస్ శాంప్సన్‌‌‌‌ గా గుర్తించారు. శనివారం అతడిని అరెస్టు చేసి హిల్స్‌‌‌‌ బరో కౌంటీ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.