హైదరాబాద్: హైదరాబాద్లో సైకో కిల్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు వృద్ధురాళ్లను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో ఎక్కించుకుని నిమిషాల వ్యవధిలోనే హత్యలు చేశాడు. బంగారం కోసం సైకో కిల్లర్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు తేల్చారు. హత్య చేసి కారులో మృతుదేహాన్ని తీసుకు వెళ్లి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో పడేశాడు.
ఈ సైకో కిల్లర్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో వైద్యుడి ఇంట్లో కారు డ్రైవర్గా పని చేస్తున్నట్లుగా తెలిసింది. మార్చి 11న యాదమ్మ అనే వృద్ధురాలిని, మార్చి 14న మంగమ్మ అనే వృద్ధురాలిని ఈ కిరాతకుడు బంగారం కోసం హత్య చేశాడు. హత్యలు జరిగిన 15 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
