
- హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఘటన
కూకట్‌పల్లి, వెలుగు: తాను ప్రేమించిన యువతిని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెండ్లి చేయడంతో కక్ష పెంచుకున్న యువకుడు.. ఆమెను పెండ్లి చేసుకున్న వ్యక్తిని హత్య చేశాడు.ఈ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వెలుగుచూసింది. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అడవిపూడికి చెందిన అన్నదమ్ములు మేడిశెట్టి జగదీశ్, దుర్గాప్రసాద్ తమ ఫ్యామిలీలతో కలిసి కొన్నేండ్ల కింద నగరానికి వచ్చి సర్దార్‌పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.
దుర్గాప్రసాద్ మరదలు శ్రావణి సంధ్య సైతం వీళ్లతోనే ఉంటోంది. అడవిపూడికే చెందిన పంపెన అయ్యప్పస్వామి అలియాస్ పవన్‌కుమార్ ఇదే కాలనీలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తాను శ్రావణిసంధ్యను ప్రేమిస్తున్నానని, తనకు ఇచ్చి పెండ్లి చేయాలని కొన్ని సంవత్సరాల కింద ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌ను కోరాడు. అందుకు యువతి కుటుంబసభ్యులు ఒప్పుకోకుండా అదే కాలనీలో ఉంటూ ఆటో నడుపుకునే కళ్ల వెంకటరమమణ (30)కు సంధ్యను ఇచ్చి పెండ్లి చేశారు.
దీంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్ తరచూ వెంకటరమణతో, అతడి ఫ్యామిలీ మెంబర్స్‌తో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే వెంకటరమణను హత్య చేసేందుకు నిర్ణయించుకొని, ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌కు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు. శ్రావణి సంధ్య మూడు రోజుల కింద ఊరికి వెళ్లగా.. వెంకటరమణ భోజనానికి జగదీశ్ ఇంటికి వచ్చేవాడు. దీనిని గమనించిన పవన్‌కుమార్ ఆదివారం అర్ధరాత్రి 12.20 గంటలకు తన నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి జగదీశ్ ఇంటి సమీపంలోకి వచ్చి పెద్దగా అరవడం మొదలుపెట్టారు.
గమనించిన జగదీశ్ బయటకు వచ్చి వారిని మందలించడంతో ఆగ్రహానికి గురైన పవన్‌కుమార్, అతడి ఫ్రెండ్స్ గొడవకు దిగారు. దీంతో స్థానికులను పిలిచేందుకు జగదీశ్ పక్కకు వెళ్లగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం... ఐదుగురు కలిసి కత్తులతో వెంకటరమణ ఛాతిపై పొడిచి పరార్ అయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపారు.