మేడ్చల్ జిల్లా జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీస్తుండగా కారు అదుపు పల్టీలు కొట్టింది. ఈ దారుణ ఘటనలో అనంతారం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువకుడు మహమ్మద్ రెహన్ పాషా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
అసలు ఏం జరిగిందంటే.. కొల్తూర్ గ్రామం సమీపంలో కొంతమంది యువకులు స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో కారు నడుపుతున్న దీనేష్ రెడ్డి అనే యువకుడు.. డ్రైవింగ్ చేస్తూనే మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీయడం ప్రారంభించాడు. కారు అతివేగంగా ఉండటం, డ్రైవర్ శ్రద్ధ వీడియోపైకి మళ్లడంతో.. కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోసాగింది. ప్రమాదాన్ని ముందే గమనించిన పక్కనే ఉన్న రెహన్ పాషా.. కారును ఆపేందుకు కంగారులో హ్యాండ్ బ్రేక్ లాగాడు.
అతివేగంతో వెళ్తున్న కారుకు ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో.. ఆ వాహనం రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఒక భారీ చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు స్విఫ్ట్ కారు పూర్తిగా ధ్వంసమై అయింది. కారులో ప్రయాణిస్తున్న రెహన్ పాషా తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారులో ఉన్న డ్రైవర్ దీనేష్ రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న జినోమ్ వ్యాలీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
