మోకాలి నొప్పికి కార్టిలేజ్​ ఇంజెక్షన్​

మోకాలి నొప్పికి  కార్టిలేజ్​ ఇంజెక్షన్​

    జర్మనీ శాస్త్రవేత్తల కొత్త రీసెర్చ్​

    మోకాలి చిప్ప రిపేర్​దిశగా ముందడుగు

మోకాలిచిప్పలు అరిగితే నిలబడటం, కూర్చోవడం, నడవడం కూడా కష్టమైపోతుంది. కనీసం చిన్నచిన్న పనులు చేసుకోవాలన్నా, పంటి బిగువున నొప్పిని భరించక తప్పదు. మరేం చేయాలి? రోజూ నొప్పి మందులు వేసుకోవాల్సిందేనా? కొత్త మోకాలి చిప్పను మార్చుకోక తప్పదా? ఆ అవసరం ఇక ఉండదంటున్నారు జర్మనీ సైంటిస్టులు. మోకాలి చిప్ప అరిగిపోయిన చోట కొత్త కార్టిలేజ్​కణాలను సూది ద్వారా ఇస్తే చాలంటున్నారు. అరిగిపోయిన కార్టిలేజ్ ​తిరిగి రిపేర్ ​అయిపోతుందని చెబుతున్నారు. హీడల్ బర్గ్ ​యూనివర్సిటీకి చెందిన 71 మంది టీనేజర్లపై చేసిన పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాయని వారు వెల్లడించారు.

కార్టిలేజ్​ అనేది మెత్తగా ఉండే ఎముక. దీన్నే మృదులాస్థి అని అంటారు.  కీళ్ల మధ్య రాపిడి జరగకుండా చూస్తుంది. ఇది అరిగిపోతే కీలు కదిలినప్పుడు ఎముకల మధ్య రాపిడి జరిగి నొప్పి ఏర్పడుతుంది. ఆర్థ్రైటిస్​ లేదా ఆస్టియో ఆర్థ్రైటిస్ ​కారణంగా ఇది అరిగిపోతుంటుంది. దీనిని రిపేర్​ చేసేందుకు ప్రస్తుతం మైక్రోఫ్రాక్చర్​ అనే పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇందులో కార్టిలేజ్​ దెబ్బతిన్న చోట ఎముకకు డ్రిల్లింగ్​ చేసి, రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాల్లోకి రక్తం ప్రవహించి, రక్తంలోని మూలకణాల వల్ల సహజంగానే కార్టిలేజ్​ తిరిగి ఏర్పడేందుకు చాన్స్​ ఉంటుంది. కానీ, ఈ పద్ధతిలో ఫలితం తక్కువ. అందుకే.. తాము ఈ కొత్త పద్ధతిని కనిపెట్టామని జర్మనీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పద్ధతిలో కార్టిలేజ్​లోని కాండ్రోసైట్​కణాలను సేకరించి,  ల్యాబ్​లో ఏడు వారాలపాటు విభజన చెందేలా చేశారు. విభజన చెందిన కార్టిలేజ్​కణాలు ఒకదానికొకటి అతుక్కునిపోతూ చిన్న చిన్న గోళాకారపు అణువుల్లా మారిపోయాయి. వాటిని తీసుకుని రోగుల మోకాలిలో కార్టిలేజ్ ​దెబ్బతిన్న చోట సూది ద్వారా పంపించారు. దీంతో కొన్ని రోజుల్లోనే దృఢమైన కార్టిలేజ్ ​తిరిగి ఏర్పడింది. నొప్పి పూర్తిగా మాయం అయిపోయింది. అయితే, యుక్త వయసులో ఉన్నవారికి, సొంత కార్టిలేజ్​కణాలను ఎక్కించే వారికి మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. అరవై ఏండ్లు దాటిన 10% మగవాళ్లు, 13% ఆడవాళ్లను మోకాలి సమస్యలు వేధిస్తున్నాయి.