
బషీర్‌బాగ్, వెలుగు: దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్ 6లో అక్టోబర్ 12న జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. హెరిటేజ్ అపార్ట్‌మెంట్స్‌లో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటనలో కేర్‌టేకరే దొంగ అని పోలీసులు తేల్చారు. శుక్రవారం వివరాలను డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
వృద్ధ దంపతులు తమ ఇంట్లో ఏపీలోని కృష్ణ జిల్లా కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన గోవర్ధన్‌ను కేర్‌టేకర్‌గా నియమించుకున్నారు. అతడే వారిపై దాడి చేసి చోరీకి పాల్పడ్డాడు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన కనిపించకపోవడంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేసినట్లు డీసీపీ తెలిపారు. చోరీ చేసిన ఆభరణాలను కంకిపాడు ముతూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు.