US Open 2025: జొకోవిచ్‌కు కార్లోస్ దెబ్బ.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్‌తో సిన్నర్ ఢీ

US Open 2025: జొకోవిచ్‌కు కార్లోస్ దెబ్బ.. యూఎస్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్‌తో సిన్నర్ ఢీ

యూఎస్ ఓపెన్ లో కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్‌ మధ్య బ్లాక్ బస్టర్ పోరు ఖామనుకుంటే ఏకపక్షంగా ముగిసింది. శుక్రవారం (సెప్టెంబర్ 5) అర్ధ రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో స్పానిష్ టెన్నిస్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. 24 సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత నోవాక్ జొకోవిచ్‌ ను చిత్తుగా ఓడించాడు. మ్యాచ్ మొత్తం జొకోవిచ్ పై ఆధిపత్యం చూపించిన కార్లోస్ 6-4, 7-6(4), 6-2 తేడాతో జొకోవిచ్ కు ఓడించి యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్‌కు చేరుకున్నాడు.

ఈ మ్యాచ్ కు ముందు అల్కరాజ్‌తో జరిగిన తన చివరి రెండు మ్యాచ్‌లలో జొకోవిచ్ గెలవడంతో ఈ సెమీ ఫైనల్ పై ఆసక్తి పెరిగింది. 38 ఏళ్ళ జొకోవిచ్ మరోసారి అల్కరాజ్ పై ఆధిపత్యం చూపించడం ఖాయమనుకున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచి ఈ స్పెయిన్ స్టార్ జొకోవిచ్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్ ను 6-4 తేడాతో గెలుచుకొని శుభారంభం చేశాడు. రెండో సెట్ లో జొకోవిచ్ ప్రతిఘటించడంతో టై బ్రేక్ కు దారి తీసింది. టై బ్రేక్ లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన అల్కరాజ్ రెండో సెట్ గెలుచుకున్నాడు. మూడో సెట్ లో కార్లోస్ దెబ్బకు నోవాక్ వద్ద సమాధానం లేకుండా పోయింది. 

రెండు సార్లు జోకో సర్వీస్ బ్రేక్ చేసి 6-2 తేడాతో సెట్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో అల్కరాజ్ మొత్తం నాలుగు సార్లు జొకోవిచ్ సర్వీస్ ను బ్రేక్ చేయగా.. జొకోవిచ్ కేవలం ఒకసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేయగలిగాడు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ జనిక్ సిన్నర్.. కెనడా ప్లేయర్ ఫెలిక్స్ అగర్-అలియాసిమ్‌పై విజయం సాధించాడు. శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం జరిగిన రెండో సెమీస్ లో 6-1,3-6,6-3,6-4 తేడాతో ఫెలిక్స్ అగర్ పై గెలిచి అల్కరాజ్ తో ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. ఆదివారం (సెప్టెంబర్ 7) టైటిల్ గెలిచిన ప్లేయర్ వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ గా స్వదేశానికి వెళ్తారు.