
సిన్సినాటి ఓపెన్ టైటిల్ 2025ను అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఫైనల్లో తన చిరకాల ప్రత్యర్థి జానిక్ సిన్నర్ తొలి సెట్ జరుగుతున్నప్పుడే గాయం కారణంగా తప్పుకోవడంతో అల్కరాజ్ మ్యాచ్ మొత్తం ఆడకుండానే విజేతగా నిలిచాడు. మంగళవారం (ఆగస్టు 19) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో 5-0 తో అల్కరాజ్ తొలి సెట్ లో ఆధిక్యంలో ఉన్నప్పుడు సిన్నర్ మ్యాచ్ ఆడలేనని రిటైర్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య సమరాన్ని ఎంజాయ్ చేయాలనుకున్న టెన్నిస్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. గత నెలలో సిన్నర్ చేతిలో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడిన అల్కరాజ్ కు సిన్సినాటి ఓపెన్ తో ఓదార్పు విజయాన్ని పొందాడు.
అల్కరాజ్ కు ఈ ఏడాది ఇది ఆరో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ కావడం విశేషం. ఓవరాల్ గా ఈ స్పెయిన్ స్టార్ కెరీర్ లో ఇది ఎనిమిదో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్. అంతేకాదు ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత సిన్నర్ గాయంపై అల్కరాజ్ స్పందించాడు.. "నేను నీపై ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ లు గెలవాలని కోరుకోవడం లేదు. నువ్వు ప్రస్తుతం ఎంత బాధపడుతున్నావో నేను అర్ధం చేసుకోగలను. ఇలాంటి సమయంలో నాకు మాటలు రావడం లేదు. నువ్వు నిజమైన ఛాంపియన్". అని అల్కరాజ్ చెప్పుకొచ్చాడు.
అనారోగ్యం కారణంగా ఫైనల్ మ్యాచ్ మధ్యలో రిటైర్ అయినందుకు సిన్నర్ తన ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. తొలి సెట్ లో 0-5 తో వెనకబడిన సిన్నర్ 31 డిగ్రీల ఎండలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మిమ్మల్ని నిరాశపరిచినందుకు చాలా బాధగా అనిపించింది. అని సిన్నర్ ట్రోఫీ ప్రజెంటేషన్ సందర్భంగా అభిమానులతో అన్నాడు. వచ్చే వారం నుంచి యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సిన్నర్ ఆడతాడా లేదా అనే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి.