అల్కరాజ్ అదుర్స్‌‌‌‌‌‌‌‌.. యూఎస్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో కార్లోస్‌‌‌‌‌‌‌‌

అల్కరాజ్ అదుర్స్‌‌‌‌‌‌‌‌.. యూఎస్ ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో కార్లోస్‌‌‌‌‌‌‌‌

న్యూయార్క్: యూఎస్ ఓపెన్  గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో టాప్ సీడ్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్, సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ పలు రికార్డులను బద్దలు కొడుతూ  క్వార్టర్స్ చేరుకున్నారు.  ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో 2022 చాంపియన్, రెండో సీడ్ అల్కరాజ్ 7-–6 (7/-3), 6–-3, 6–-4తో  ఆర్థర్ రిండర్క్‌‌‌‌‌‌‌‌నెచ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)  ఓడించాడు. దాంతో ఆడిన19 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ టోర్నీల్లోనే 13వ సారి క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరి 23 ఏండ్ల అల్కరాజ్‌‌.. బోరిస్ బెకర్ రికార్డును బద్దలు కొట్టాడు. 

 ఈ ఘనత సాధించిన యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ నిలిచాడు. పీట్ సంప్రాస్, రఫెల్ నడాల్ తర్వాత ఒకే సీజన్‌‌‌‌‌‌‌‌లో నాలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీల్లో  క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు చేరిన మూడో యంగెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్. అలాగే, 23 ఏండ్లలోపు యూఎస్ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు చేరిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. తొలి సెట్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌కు ఆర్థర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. దాన్ని టై బ్రేక్‌‌‌‌‌‌‌‌లో నెగ్గిన స్పెయిన్ స్టార్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తొలి సెట్ నాలుగో గేమ్‌‌‌‌‌‌‌‌లో అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. అద్భుతమైన షాట్‌‌‌‌‌‌‌‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆర్థర్ నెట్ దగ్గరకు వచ్చి బాల్‌ను బలంగా కొట్టాడు. అప్పుడు అల్కరాజ్ బంతిని దాటి ముందుకు పరిగెత్తాడు. కానీ వెంటనే తన రాకెట్‌‌‌‌‌‌‌‌ను వీపు వెనకకు తిప్పి బాల్‌‌‌‌‌‌‌‌ను తిరిగి కొట్టాడు. ఆశ్చర్యానికి గురైన ఆర్థర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాన్ని రిటర్న్ చేసే ప్రయత్నంలో నెట్‌‌‌‌‌‌‌‌కు కొట్టాడు. ఈ షాట్ చూడగానే ఆర్థర్ యాష్ స్టేడియంలోని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. 2 బ్రేక్ పాయింట్లు, 18 నెట్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు, 36 విన్నర్లతో విజృంభించాడు.   క్వార్టర్ ఫైనల్లో అతను చెక్ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌కు చెందిన 20వ సీడ్ జిరి లెహెకాతో తలపడతాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో లెహెకా (చెక్‌ రిపబ్లిక్‌) 7–-6 (7/6), 6–-4, 2-–6, 6-–2తో అడ్రియన్ మనారినో ( ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై  గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు.

జొకోవిచ్ 64వ సారి..

24 సార్లు గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ చాంపియన్ అయిన నొవాక్ జొకోవిచ్ మెడనొప్పితో ఇబ్బంది పడినా రికార్డు స్థాయిలో 64వ సారి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌  క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌ల్లో అడుగు పెట్టాడు.ఏడో సీడ్ నొవాక్ 6--–3, 6–--3, 6–--2తో  జర్మనీ క్వాలిఫయర్ జాన్-లెన్నార్డ్ స్ట్రఫ్‌‌‌‌‌‌‌‌పై  ఘన విజయం సాధించాడు. మ్యాచ్ ఆరంభంలో 4-–-0 ఆధిక్యంలో ఉన్నప్పుడు జొకో మెడనొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత రెండు గేమ్‌‌‌‌‌‌‌‌లు కోల్పోయినప్పటికీ, వెంటనే తేరుకుని మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై పట్టు సాధించాడు. సెట్ విరామంలో ఫిజియోతో చికిత్స తీసుకున్న జొకోవిచ్ ఏమాత్రం తడబడకుండా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 12 ఏస్‌‌‌‌‌‌‌‌లతో హడలెత్తించిన నొవాక్.. 6 బ్రేక్ పాయింట్లు సాధించాడు. 33 విన్నర్లు కొట్టి స్ట్రఫ్‌‌‌‌‌‌‌‌ ఆట కట్టించాడు.  గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టోర్నీల్లో నొవాక్ రికార్డు స్థాయిలో 64వ సారి క్వార్టర్ ఫైనల్ చేరాడు. 38 ఏండ్ల వయసులో ఒకే సీజన్‌‌‌‌‌‌‌‌లో నాలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌లలో క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు చేరిన ఓల్డెస్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానూ అతను చరిత్ర సృష్టించాడు.  క్వార్టర్ ఫైనల్‌‌‌‌‌‌‌‌లో జొకోవిచ్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌‌‌‌‌‌‌‌తో తలపడనున్నాడు.  గత సీజన్ రన్నరప్, నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ 6–--4, 6-–-3, 6-–-3తో చెక్ రిపబ్లిక్ ఆటగాడు టోమాస్ మచాక్‌‌‌‌‌‌‌‌పై ఈజీగా గెలిచాడు. మరో మ్యాచ్‌‌లో ఎనిమిదో సీడ్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6–3, 6–2, 6–1తో స్విస్ ప్లేయర్‌‌‌‌ లియెనార్డో రీడిని ఓడించాడు.కాగా, మెన్స్ డబుల్స్‌‌ రెండో రౌండ్‌‌లో ఇండియా ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్‌‌‌‌–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 3–6తో ఫెర్నాండో రంబోలి (బ్రెజిల్‌‌)–జాన్ పాట్రిక్ (ఆస్ట్రేలియా)  చేతిలో ఓడి ఇంటిదారి పట్టారు.

సబలెంకా దూకుడు

విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌  నంబర్ వన్, అరీనా సబలెంకా జోరు చూపెట్టింది. ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బెలారస్ స్టార్  6–-1, 6–-4తో స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్ క్రిస్టినా బుక్సాను  చిత్తుచేసి వరుసగా 12వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్ క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది.    మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో మార్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌)  6–-4, 5–-7, 6–-2తో తొమ్మిదో  సీడ్  రిబకినా (కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌ )ను  ఓడించింది.  క్రెజికోవా (చెక్‌‌‌‌‌‌‌‌) రెండో సెట్ టై బ్రేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏకంగా 8 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాపాడుకొని 1–-6, 7–-6 (15/13, 6–-3తో లోకల్ ప్లేయర్ టౌన్‌‌‌‌‌‌‌‌సెండ్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.