హన్మకొండలో భూ కబ్జాలకు పాల్పడుతున్న 10 మందిపై కేసు

హన్మకొండలో భూ కబ్జాలకు పాల్పడుతున్న 10 మందిపై కేసు

గ్యాంగ్ స్టర్ నయీం.. ఈ పేరు గుర్తుండే ఉంటుంది కదా. అనేక అరాచకాలకు పాల్పడుతూ చెలరేగిపోతున్న నయీంను కొన్ని సంవత్సరాల క్రితం పక్కా సమాచారంతో ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అతను చనిపోయినా అతని అనుచరుల ఆగడాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నయీం గ్యాంగ్ దందాలకు పాల్పడుతుండడం.. అందులో పోలీసులు కూడా ఉండడం విస్తుగొలుపుతున్నాయి. తాజాగా.. హన్మకొండలో భూ కబ్జాలకు పాల్పడుతున్న పది మందిపై కేయూ పీఎస్ లో కేసు నమోదైంది.

వీరిలో ముగ్గురు నయీం అనుచరులు, ఒక పోలీస్​ ఆఫీసర్​ఉన్నారు. ఆరుగురిని అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇందులో  ఏ1గా వేణుగోపాల్, ఏ2గా ఆర్ఐ సంపత్​కుమార్ లను చేర్చారు. పరారీలో ఉన్న వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 2016లో గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీంను ఎన్ కౌంటర్ చేశారు. షాద్ నగర్ లో గుర్తు తెలియని వ్యక్తి మారణాయుధాలతో సంచరిస్తున్నాడని పోలీసులకు సమాచారం తెలియడంతో వారు అక్కడకు చేరుకున్నారు. అతను నయీంగా పోలీసులు నిర్ధారించారు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో నయీం చనిపోయాడు. గ్యాంగ్ స్టర్ గా మారిన నయీం దందాలు, సెటిల్ మెంట్లు, బెదిరింపుల ద్వారా వందల కోట్లు కొల్లగొట్టినట్లు దర్యాప్తుల్లో తేలింది.