బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదు

బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదు

బీఆర్ఎస్  మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.  జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై 6 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  దామోదర్ రెడ్డి అనే వ్యక్తి  తన భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఎర్లపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని  దామోదర్ రెడ్డి 2022లో కొనుగోలు చేశారు. సర్వేనెంబర్ 32,35,36, 38 లో ఫంక్షన్ హాల్ నిర్మించారు. దామోదర్ రెడ్డి భూమికి పక్కనే జీవన్ రెడ్డి భూమి  ఉంది.  2023లో ఫంక్షన్ హాల్ ను కూల్చేసి  జీవన్ రెడ్డి తన  భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.  

కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ ను పెట్టారని దామోదర్ రెడ్డి ఫిర్యాదులో తెలిపారు.  తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన తనపై పంజాబీ గ్యాంగ్  దాడికి పాల్పడిందని చెప్పారు.   జీవన్ రెడ్డి అనుచరులు, పంజాబీ గ్యాంగ్ మారణాయుధాలు చూపించి తనను   భయభ్రాంతులకు గురిచేశారని  చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు  దామోదర్ రెడ్డి. దీంతో  జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు . 

ALSO READ | కబ్జాలు చేసిన, డ్రగ్స్ అమ్మిన తాట తీస్తాం..సీఎం ఆదేశాలతో అధికారులు పరుగులు

ఇటీవలే  అద్దె బకాయిలు రూ. 2.50కోట్లు  డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని  ఆయన  షాపింగ్ మాల్ ను  సీజ్  చేశారు.  షాపింగ్ మాల్ గేటుకు తాళం వేశారు ఆర్టీసీ అధికారులు.  షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణదారులను బయటకు పంపించేశారు ఆర్టీసీ అధికారులు.  వెంటనే షాపింగ్ మాల్ ఖాళీ చేయాలంటూ దుకాణదారులను హెచ్చరించారు ఆర్టీసీ అధికారులు.