ఆధారాల్లేకుండా అత్తమామలపై కేసు చెల్లదు: హైకోర్టు

ఆధారాల్లేకుండా అత్తమామలపై  కేసు చెల్లదు: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలతో అత్త, మామలపై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వేధింపులకు సంబంధించి స్పష్టమైన ఆధారాలను సమర్పించాల్సి ఉందని పేర్కొంది. భర్తపై కక్షసాధింపు చర్యలో భాగంగా కోడలు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మహారాష్ట్రకు చెందిన 74 ఏండ్ల గోవింద ప్రసాద్, భార్య ఉషాశర్మలు హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిని విచారించిన జస్టిస్‌‌‌‌ జువ్వాడి శ్రీదేవి.. రికార్డులను పరిశీలిస్తే పిటిషనర్లయిన అత్తమామలపై వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా క్రూరత్వం, వేధింపులు, వరకట్నం డిమాండ్‌‌‌‌ చేశారన్న సందర్భాలను ప్రస్తావించలేదని చెప్పారు. అందువల్ల పిటిషనర్లపై నమోదైన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ను కొట్టివేస్తున్నామని తీర్పును వెలువరించారు.