ఘట్ కేసర్ రైతుసహకార సంఘం వైస్ చైర్మన్​పై కేసు

ఘట్ కేసర్ రైతుసహకార సంఘం వైస్ చైర్మన్​పై కేసు

ఘట్ కేసర్, వెలుగు:  ఫేక్ పాసు బుక్ లు సృష్టించి లే అవుట్ లోని ప్లాట్లను అమ్ముకుంటునట్లు వచ్చిన ఫిర్యాదులో ఘట్ కేసర్ రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ తో పాటు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదైంది.  పోచారం ఐటీ కారిడార్ ఇన్ స్పెక్టర్ బి రాజు వర్మ తెలిపిన ప్రకారం..  పోచారం మున్సిపాలిటీ పరిధి సర్వే నంబర్ 36 లో 1986లో 30 ఎకరాల భూమిలో  బద్దం అనంతరెడ్డి మరికొందరు కలిసి లే అవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. 

మిగిలిన కొన్ని ప్లాట్లను  అనంతరెడ్డి అమ్మేందుకు ప్రయత్నించగా అదే గ్రామానికి చెందిన బద్దం నరేందర్ రెడ్డి అడ్డుకున్నాడు. 2019లో తప్పుడు ప్రొసీడింగ్ నంబర్ తో ఫేక్ పాస్ బుక్ లు  సృష్టించిన అనంతరెడ్డి తనకు చెందని భూమిలో ప్లాట్లను అమ్ముతున్నట్టు  నరేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరెడ్డి తన భార్య, కొడుకు, కుమార్తెలకు రిజిస్ట్రేషన్ చేయడంతో కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  భూమికి సంబంధించిన వివరాలను తహశీల్దార్ నుంచి తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.