Jayakrishna: ఘట్టమనేని వారసుడు గ్రాండ్ ఎంట్రీ.. జయకృష్ణకు జోడీగా రవీనా టాండన్ కుమార్తె!

Jayakrishna: ఘట్టమనేని వారసుడు గ్రాండ్ ఎంట్రీ.. జయకృష్ణకు జోడీగా రవీనా టాండన్ కుమార్తె!

ప్రముఖ నటుడు, నిర్మాత దివంగత ఘట్టమనేని రమేశ్‌బాబు తనయుడు, సూపర్‌స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 'ఆర్‌ఎక్స్‌ 100', 'మంగళవారం' వంటి సంచలన చిత్రాల దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను ఈ రోజు ( నవంబర్ 17న అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

రాషా టాండానీ టాలీవుడ్ ఎంట్రీ

అయితే, ఈ చిత్రం ద్వారా జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ అగ్ర నటి రవీనా టాండన్ కుమార్తె రాషా టాండానీ (Rasha Thadani) కూడా తెలుగు తెరకు పరిచయం అవుతుండడం విశేషం. దర్శకుడు అజయ్ భూపతి తాజాగా రాషా పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేస్తూ ఆమె టాలీవుడ్ ఎంట్రీని ధ్రువీకరించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది.

భారీ బ్యానర్ల అండదండలు..

ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న ఈ వారసుడి తొలి చిత్రాన్ని, టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన వైజయంతి మూవీస్ బ్యానర్‌పై లెజెండరీ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు. 'చందమామ కథలు' బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ భారీ కలయికే సినిమా స్థాయిని తెలియజేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

అజయ్ భూపతి మార్క్ లవ్ స్టోరీ

దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్‌ఎక్స్‌ 100'లో ఎమోషన్, యాక్షన్‌ను బ్యాలెన్స్ చేసిన అజయ్ భూపతి, జయకృష్ణను ఏ విధంగా ప్రెజెంట్ చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయాలని జయకృష్ణ ఉవ్విళ్లూరుతున్నారు.

రాషా టాండానీ ఇప్పటికే బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ చిత్రం 'అజాద్'లో ఒక కీలక పాత్రలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో, ఆమె నటనపై సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఘట్టమనేని వారసుడు జయకృష్ణ, రవీనా టాండన్ కూతురు రాషా టాండానీ కాంబినేషన్ వెండితెరపై ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో చూడాలంటే మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. ఈ సినిమాపై ఘట్టమనేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.