పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు

పెరుగుతున్న ఖర్చులు, అప్పులు, రియల్ ఎస్టేట్.. యువత భవిష్యత్తును మింగేస్తున్నాయ్: శ్రీధర్ వెంబు

ప్రముఖ దేశీయ సాఫ్ట్ వేర్ సంస్థ జోహో కార్పొరేషన్ ఫౌండర్ శ్రీధర్ వెంబు ప్రస్తుత సమాజ పరిస్థితులపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. పెరుగుతున్న గృహ ఖర్చులు, ఎడ్యుకేషన్ కాస్ట్, వైద్యం, రియల్ ఎస్టేట్ వంటివి దేశ జనాభా భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ప్రస్తుతం దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చ జరగటంతోపాటు వేల మంది ఆయన లేవనెత్తిన అంశాలు ముమ్మాటికీ నిజమే అంటూ సమర్థిస్తున్నారు. 

నేటి యువత అప్పుల ఊబిలో చిక్కుకునేలా చేస్తున్న సమాజం తమ స్వంత భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని వెంబు అన్నారు. పెరుగుతున్న ప్రాథమిక ఖర్చులతో యువత ఫ్యామిలీ లైఫ్ ఏర్పాటు అంటే పెళ్లి చేసుకోవటం, పిల్లలను కనటం లాంటి వాటికి దూరంగా వెళుతున్నట్లు చెప్పారు. ఇది వ్యక్తిగత సమస్య కాదని.. భవిష్యత్తు సమాజ నిర్మాణంలో ఏర్పడిన లోపమని హెచ్చరించారు. 

ప్రపంచవ్యాప్తంగా అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో పడిపోతున్న జనన శాతం ఇప్పటికే ఆందోళన కలిగిస్తోందని శ్రీధర్ వెంబు గుర్తు చేశారు. భారతదేశంలోని మహానగరాలు కూడా ఇదే పరిస్థితిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయని వివరించారు. పెరుగుతున్న జీవన వ్యయాలతో యువత చాలా విషయాలను వాయిదా వేస్తూ.. సర్వైవల్ మోడ్ అంటే బతకటం కోసం పోరాటంలో మునిగిపోతున్నారని చెప్పారు. 

►ALSO READ | 6 నెలలుగా సైబర్ మోసగాళ్ల గ్రిప్పులో మహిళ.. ఏకంగా రూ.32 కోట్లు స్కామ్..

శ్రీధర్ వెంబు పోస్టుకు సోషల్ మీడియాలో విస్తృతమైన ఆధరణ లభిస్తోంది. నిజంగానే పెరిగిపోతున్న ఖర్చులతో యువత పోరాడుతున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నిర్మాణం కన్నా బతకడం ప్రధానంగా మారిపోతోందని చాలా మంది ఒప్పుకుంటున్నారు. తర్వాతి తరాలు ఎక్కువ పిల్లలను కలిగి ఉండాలంటే అందుకు అనుగుణంగా ఖర్చులను తగ్గించటం తప్పనిసరిగా వారు చెబుతున్నారు. 

ప్రస్తుతం శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు కేవలం ఆర్థిక చర్చ కాదు.. శాశ్వత అభివృద్ధి, సామాజిక సమతుల్యత, దేశం దీర్ఘకాల జనాభా స్థిరత్వంపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తాయి. యువతకు అందుబాటులో ఉన్న జీవన వ్యయాలతో పాటు సామాజిక మద్దతు వ్యవస్థలూ మారాల్సిన అవసరం ఉందని ఈ చర్చ మళ్లీ గుర్తు చేస్తోంది.