Ranji Trophy 2025-26: 20 ఓవర్లు.. 27 పరుగులు.. 8 వికెట్లు: సర్వీసెస్ స్పిన్నర్ అమిత్ శుక్లా సంచలన బౌలింగ్

Ranji Trophy 2025-26: 20 ఓవర్లు.. 27 పరుగులు.. 8 వికెట్లు: సర్వీసెస్ స్పిన్నర్ అమిత్ శుక్లా సంచలన బౌలింగ్

రంజీ ట్రోఫీలో అద్భుత గణాంకాలు చోటు చేసుకున్నాయి. సర్వీసెస్ స్పిన్నర్ అమిత్ శుక్లా సంచలన బౌలింగ్ తో హర్యానా బ్యాటర్లకు పీడకలగా మారాడు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. లాహ్లిలోని చౌదరి బన్సీ లాల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 16) తొలి రోజు ఆటలో భాగంగా 5 వికెట్లు పడగొట్టిన అమిత్ శుక్లా.. సోమవారం (నవంబర్ 17) మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్ గా 8 వికెట్లు తీసుకొని హర్యానా జట్టును తొలి ఇన్నింగ్స్ లో కేవలం 111 పరుగులకే కుప్పకూలేలా చేశాడు. ఓవరాల్ గా తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్లు బౌలింగ్ చేసిన శుక్లా.. 8 మెయిడిన్ ఓవర్లతో 27 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. 

శుక్లా స్పిన్ ధాటికి హర్యానా వద్ద సమాధానమే లేకుండా పోయింది. యువరాజ్ సింగ్‌, మయాంక్ శాండిల్య, అంకిత్ కుమార్, యశ్వర్ధన్ దలాల్, ధీరు సింగ్,  నిఖిల్ కశ్యప్ లను తొలి రోజు ఔట్ చేయడంతో 20 పరుగులకే హర్యానా సగం జట్టును కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో భాగంగా కెప్టెన్ పార్థ్ వాట్స్, కపిల్ హుడా, కంబోజ్ వికెట్లను తీసుకున్నాడు. హర్యానా బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ యువ బౌలర్  కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. మహారాష్ట్రతో జరిగిన గత సీజన్‌ రంజీలో 65 పరుగులకు ఏడు వికెట్లు తీసుకున్న శుక్లా తన బెస్ట్ బౌలింగ్ స్టాట్స్ ను అధిగమించాడు.
 
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. నకుల్ 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆ అనంతరం శుక్లా బౌలింగ్ తో హర్యానా తొలి ఇన్నింగ్స్ లో 111 పరుగులకే ఆలౌట్ అయింది. శుక్లా 8 వికెట్లు తీసుకొని హర్యానాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అంకిత్ కుమార్ 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న హర్యానా 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసి 195 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.