ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారంలో 21 మందిపై కేసు

ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారంలో 21 మందిపై కేసు

హనుమకొండ/శాయంపేట, వెలుగు: అగ్రికల్చర్ ఆఫీసర్లు, మిల్లర్ కుమ్మక్కై నకిలీ రైతుల పేరుతో ప్రభుత్వ సొమ్మును కాజేసిన ఘటనలో 21 మందిపై కేసు నమోదైంది. ధాన్యం పండించకున్నా పండించినట్టు, 8 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి తరలించినట్లు ఫేక్ ట్రక్ షీట్లు తయారు చేసి రూ.1.86 కోట్లు డ్రా చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో వెలుగుచూసిన ఈ ఘటనలో ముగ్గురు అగ్రికల్చర్ ఆఫీసర్లు, ప్రధాన నిందితుడైన మిల్లర్ సహా 21 మందిపై కేసు నమోదు చేశారు. 

ఇందుకు సంబంధించిన వివరాలను సివిల్ సప్లయీస్ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఎస్పీ శశిధర్ రాజు శనివారం హనుమకొండ కలెక్టరేట్ లో వెల్లడించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన బెజ్జంకి శ్రీనివాస్ తన రైస్ మిల్ వేదికగా బండ లలిత అనే మహిళతో కలిసి వడ్ల స్కామ్ కు తెరలేపాడు. తన కుటుంబ సభ్యులు, బంధువులను రైతులుగా చూపి, 278 ఎకరాల్లో సాగు చేసిన 8,049 క్వింటాళ్ల వడ్లను శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్ల ద్వారా తరలించినట్లు ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించాడు. 

ధాన్యం డబ్బులు వారివారి ఖాతాల్లో జమ కాగా.. అంతా కలిసి మూడు నెలల క్రితం రూ.కోటి 86 లక్షల 63 వేల 88 డ్రా చేశారు. వీరికి అగ్రికల్చర్ ఆఫీసర్ కె.గంగాజమున, ఏఈవోలు బి.అర్చన, ఎం.సుప్రియ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఓపీఎంఎస్ ప్రైవేటు ట్యాబ్ ఆపరేటర్ వాంకుడోతు చరణ్, శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు బి.హైమావతి, అనిత సహకరించారు. ఈ వ్యవహారంలో 21 మందిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్​ ఎస్పీ శశిధర్​ రాజు తెలిపారు.