
హైదరాబాద్/ఖమ్మం : పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్‌రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్ లోని షేక్‌పేట తహసీల్దార్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.3లో ప్లాట్ నంబరు 8-C పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని 'దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థకు చెందిన ఉపేందర్‌రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేశారు. ఆపై అందులో నిర్మాణాలు సైతం చేపట్టారు. షేక్ పేల తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో పాలేరు మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తదితరులపై ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471; సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.