పంజాగుట్ట పీఎస్ లో షర్మిలపై కేసు నమోదు

పంజాగుట్ట పీఎస్ లో షర్మిలపై కేసు నమోదు

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ట్రాఫిక్ కి అంతరాయం కలిగించారని పంజాగుట్ట పీఎస్ లో ఆమెపై కేసు నమోదు చేశారు. ఐపీసీ  353, 333, 327 సెక్ష‌న్ల‌ కింద ష‌ర్మిలపై పోలీసులు  కేసు న‌మోదు చేశారు.

నిన్న వరంగల్ లో  బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి షర్మిల పిలుపునిచ్చింది.  ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో వెళ్తున్న ఆమెను  పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  షర్మిల, పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయినా ఆమె కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రాఫిక్ జాం, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల కారులో ఉండగానే దాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీసుల వైఖరిపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు బిల్డింగ్ ఎక్కి నిరసన చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రాష్ట్రంలో గుండాల రాజ్యం: షర్మిల

రాష్ట్రంలో గూండాల రాజ్యం నడుస్తోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నది నాయకులు కార్యకర్తలు కాదు.. గూండాలని అన్నారు. ఉద్యమకారుల్ని పార్టీ నుంచి వెళ్లగొట్టి గూండాల పార్టీలా మార్చారని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. పోలీసులు కూడా గూండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.