ప్రభుత్వ భూమిని అమ్ముకున్న బీఆర్ఎస్ నాయకుడు..

ప్రభుత్వ భూమిని అమ్ముకున్న బీఆర్ఎస్ నాయకుడు..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించిన నెల్లికుదురు బీఆర్ఎస్ జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డిపై కేసు నమోదయింది.  జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని  తహశీల్దార్ ఇమ్మాన్యుయేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్  పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ రెడ్డితో పాటు మరొకరిపై ఐపీసీ 447, 427 కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. 

మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎమ్మార్వో ఇమ్మాన్యుయేల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ భూమిని ఇతరులకు విక్రయించిన జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డితో పాటు..మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమిలో అమ్మకం, కొనుగోలు నిషేధం.. ఈ భూమిలో ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేసినా  చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంతటి వారినైనా వదిలేది లేదని తహశీల్దార్ ఇమ్మాన్యుయేల్ హెచ్చరించారు.