ప్రశ్నిస్తే రైతులపై కేసులు... కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది

ప్రశ్నిస్తే రైతులపై కేసులు... కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది
  • ఆందోళనలు చేసినా, అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్నా అరెస్టులు 
  • నాన్ బెయిలబుల్​తో పాటు హత్యాయత్నం కేసులూ నమోదు 
  • భూముల పరిహారం అడిగినా, వడ్ల తరుగుపై నిలదీసినా తప్పేనట?

వెలుగు, నెట్​వర్క్:  రాష్ట్రంలో వివిధ సమస్యలపై ప్రశ్నిస్తున్న రైతులపై కేసులు పెడుతున్నరు. ఆందోళనలు చేసినా, నిరసనలు తెలిపినా, అధికారులను నిలదీసినా.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకున్నా అరెస్టు చేస్తున్నరు. వివిధ సెక్షన్లతో పాటు నాన్ బెయిలబుల్, చివరికి హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేస్తున్నరు. దీంతో అన్యాయం జరిగిందని రోడ్డెక్కుతున్న అన్నదాతలు జైళ్లకు పోవాల్సి వస్తున్నది. వాళ్లకు బెయిల్ ఇప్పించేందుకు కుటుంబసభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నరు. అరెస్టయిన రైతులు బెయిల్ పై బయటకొచ్చినా, ఆ కేసులపై ఏండ్లకేండ్లు కోర్టుల చుట్టూ తిరిగి అప్పులపాలవుతున్నరు. హనుమకొండ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ జీవోను రద్దు చేయాలనే డిమాండ్ తో 2022 మే 31న ఐనవోలు మండలం పెరుమాండ్లగూడెం వద్ద వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ను రైతులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్సై ఫిర్యాదు మేరకు 143, 290, 332, 353 సెక్షన్ల కింద 12 మంది రైతులపై కేసులు పెట్టారు. 

2019 సెప్టెంబర్ 13న మొదటి విడత పల్లె ప్రగతి కోసం మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని హిమ్మత్​రావుపేటకు రాగా.. శనివారం పేట, డబ్బు తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఘెరావ్​ చేశారు. పోతారం చెరువు నుంచి గ్రావిటీ కెనాల్ నిర్మించకపోవడంతో తమ భూములు పడావు పడ్తున్నాయని, కెనాల్​ఇంకెప్పుడు నిర్మిస్తారని నిలదీశారు. దీంతో గోల్కొండ రాజు, నీలగిరి గంగారావు, సురుకంటి తిరుపతి రెడ్డి, రొండి శ్రుతిక్, బొమల్ల సత్తయ్య, డబ్బు గౌతం రెడ్డి, సురుకంటి ముత్యం రెడ్డి, అశోక్ రెడ్డి అనే రైతులపై 143, 341 r/w 149 సెక్షన్ల కింద కేసు పోలీసులు కేసులు పెట్టారు. ప్రస్తుతం బాధితులంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

మంచిప్ప నిర్వాసితులపై హత్యాయత్నం కేసు..

నిజామాబాద్ జిల్లాలో మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంచడం వల్ల రెండు గ్రామాలు, 9 గిరిజన తండాలు, 1400 ఎకరాల పట్టా భూములు, 800 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్​ మునిగిపోతున్నాయి. రిజర్వాయర్​ఎత్తు పెంచడం వల్ల ఎలాంటి లాభం లేదని, పైగా తమ ఊళ్లు పోయి, తాము నడిరోడ్డున పడ్తామంటూ అక్కడి రైతులు కొన్నాళ్లుగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో గతేడాది మే 26న భైరాపూర్​పంపుహౌస్ వద్ద ఆందోళన చేసిన 12 మంది రైతుల మీద ఏకంగా సెక్షన్​307 కింద హత్యాయత్నం కేసు పెట్టారు. రైతులను అరెస్టు చేసి 11 రోజుల పాటు  జైలుకు పంపారు. రైతులు ఇప్పటికీ కేసుల మీద కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 

పోయినేడాది జూన్​14న గౌరవెల్లి ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులు హుస్నాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉన్న పరిహారాల కోసం ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి నిర్వాసితులపై కర్రలతో దాడి చేశారు. గొడవలో ఏసీపీ సతీశ్, ఎస్ఐ శ్రీధర్, పలువురు రైతులు గాయపడ్డారు. కానీ పోలీసులు 40 మంది రైతుల మీద  143, 147, 148, 332, 333, 324, 326, 341, 353, 294(b)  సెక్షన్ల కింద కేసులు పెట్టారు. విచారణ సందర్భంగా రైతుల చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చారు. నాన్​బెయిలబుల్​కేసులు కావడంతో కొంతకాలం జైలులో ఉన్న రైతులు, తర్వాత బయటకు వచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అంతకుముందు ఇదే  సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ భూనిర్వాసితులు 2016 జూలై 25న రాజీవ్ రహదారిపై ధర్నా చేపడితే దాదాపు 20 మందిపై 307, 304  సెక్షన్ల కింద  కేసులు పెట్టారు. 

ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తోంది. మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన గిరిజన రైతులు తమకు పట్టా పాస్ బుక్కులు రాలేదని తహసీల్దార్ ఆఫీస్ ముందు 2021 జూన్​లో ఆందోళన చేయగా 10 మందిపై కేసు పెట్టారు. వారు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ‘‘కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినంక రైతులపై కేసులు ఎక్కువైనయ్. రైతురాజ్యం అని చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వంలో వందలాది మంది రైతులు జైళ్లకు పోవాల్సి వస్తున్నది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది” అని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు.

రెండేండ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నం.. 

మా భూములకు పట్టా పాస్​బుక్స్ ఇవ్వలేదని రెండేండ్ల కింద తహసీల్దార్​ఆఫీస్ దగ్గర ధర్నా చేసినం. దీంతో ఆఫీసర్లు కక్ష కట్టి మా మీద కేసులు పెట్టించిన్రు. అప్పటి నుంచి ఇప్పటివరకు పనులు వదిలిపెట్టి నెలకోసారి మెదక్ కోర్టు చుట్టూ తిరుగుతున్నం. మా పోరాటంతో పాస్ బుక్స్ వచ్చినయి గానీ కేసులు మాత్రం కొట్టేస్తలేరు. ఇప్పటికైనా సర్కారు మా మీద పెట్టిన కేసులు కొట్టేయాలె. - కెష్యా నాయక్, రైతు, తాళ్లపల్లిగడ్డ తండా, మెదక్​జిల్లా

రైతులపై హత్యాయత్నం కేసులా?

మంచిప్ప ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్నామని ప్రభుత్వం మాపై అక్రమ కేసులు బనాయించింది. బైరాపూర్ సమీపంలో జరుగుతున్న పంప్ హౌస్ దగ్గర  ధర్నా చేస్తే 12 మందిపై హత్యాయత్నం కేసు పెట్టి  జైలుకు పంపింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్నిసార్లు అరెస్టు చేసినా పనికిరాని ప్రాజెక్టు కోసం మా భూములను ఇచ్చే ప్రసక్తే లేదు. వెంటనే రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. - శ్రీనివాస్, మంచిప్ప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు, నిజామాబాద్

పరిహారం అడిగితే కేసు పెట్టిన్రు..

మాకు వ్యవసాయం చేసి నలుగురికి తిండి పెట్టుడే తెల్సు. గౌరవెల్లి కోసం మా భూములు తీసుకు న్నరు. ఊరు విడిస్తే మళ్లీ భూములు కొని వ్యవసాయమే చేసుకోవాలె. కానీ సర్కారు ఇచ్చే పరిహారంతో భూములు కొనలేం. అందుకే పరిహారం పెంచి ఇవ్వాలని అడిగినం. కానీ మమ్ములను పోలీసులతో కొట్టిచ్చిన్రు. అక్రమ కేసులు బనాయించి, నేరస్తులను తీసుకొచ్చినట్లు బేడీలతో తీసుకొచ్చిన్రు. ఎవుసం చేసుకు నేటోళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతున్నరు. - బద్ధం శంకర్​రెడ్డి, గౌరవెల్లి నిర్వాసితుడు, గుడాటిపల్లి

మంత్రిని అడ్డుకున్నరని..

ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి తమ భూములను కాపాడాలంటూ యాదాద్రి జిల్లా రాయగిరికి చెందిన రైతులు మే 30న కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. గేట్ల ముందు గడ్డిని కాల్చి నిరసన తెలిపారు. అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మంత్రి కాన్వాయ్​ను అడ్డుకోవడంతో పాటు పోలీస్ అవుట్ పోస్టును కాలబెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ రైతులపై పోలీసులు నాన్​బెయిలబుల్ కేసులు పెట్టారు. రైతులు గడ్డమీది మల్లేశ్, పల్లెర్ల యాదగిరి, అవిశెట్టి నిఖిల్, మల్లెబోయిన బాలును అరెస్ట్​చేసి నల్గొండ జిల్లా జైలుకు తరలించారు. వీళ్లు పది రోజులుగా జైల్లోనే ఉండగా, వాళ్ల కుటుంబసభ్యులు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 

తరుగుపై ప్రశ్నించిండని.. 

కరీంనగర్ జిల్లా మానకొండూర్​మండలం వేగురుపల్లికి చెందిన ఇట్టవేణి సంపత్ పదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వడ్లను ఏప్రిల్ 14న  పీఏసీఎస్ కొనుగోలు సెంటర్​లో కాంటా పెట్టించాడు. ఆ టైమ్ లో సంచికి రెండు కిలోల చొప్పున క్వింటాల్​కు 5 కిలోలు కట్​చేశారు. తర్వాత తరుగు కింద మరో 11 బస్తాలు కోత పెట్టినట్టు  సెంటర్ ఇన్​చార్జి చెప్పడంతో సంపత్ నిలదీశాడు. ఇన్ చార్జ్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో గోదాంకు తాళం వేసి నిరసన తెలిపాడు. దీంతో సెంటర్​ ఇన్​చార్జి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంపత్​పై మే 23న సెక్షన్ 342 కింద కేసు నమోదు చేశారు.